వివేకా హత్య కేసులో చేయాల్సిన దర్యాప్తు అంతా పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు కోర్టులో తుది చార్జిషీట్‌ను దాఖలు చేయడానికి సీబీఐ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇది హై ప్రోఫైల్ కేసు కావడంతో కొంత మంది ఉన్నతాధికారులు కడపకు రానున్నారని వారు వచ్చి సమీక్షించిన తర్వాత తుది చార్జిషీట్ దాఖలు చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే రెండు చార్జిషీట్లను దాఖలు చేశారు. ఇటీవల దస్తగిరి అప్రూవర్‌గా మారిన తర్వాత కోర్టు ఎదుట స్టేట్మెంట్ నమోదు చేయించారు. ఆ స్టేట్మెంట్లో ఏముందో తెలియదు కానీ అనుమానితులు.. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాలు అన్నీ బయటకు వచ్చాయి.
అప్రూవర్‌గా దస్తగిరి చెప్పింది తుది చార్జిషీట్లో ఉండే అవకాశం ఉంది. వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా ఉన్నతాధికారులు వచ్చిన తర్వాత నోటీసులు జారీ చేస్తారని..ప్రశ్నించకుండానే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు బెయిల్ కోసం అదే పనిగా పిటిషన్లు పెట్టుకుంటున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి కడప కోర్టు మరోసారి షాకిచ్చింది. బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. విచారణ కీలక దశలో ఉందని ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ వాదించింది.
అయితే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నారని ఆయనకు బెయిల్ ఇవ్వాలని లాయర్లు వాదించారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన కడప జిల్లా కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు చెప్పింది. మరో వారంలో వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రాజకీయంగా హైవోల్టేజ్ విమర్శలు.. ప్రతి విమర్శలు ఈ కేసు కేంద్రంగా నడుస్తున్నాయి.