ఆంధ్రప్రదేశ్ ను నరేంద్రమోడీ నమ్మించి మోసం చేశారని.. విభజన హామీలు అమలయ్యేలా చూడాలని.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు. అఖిలపక్ష నేతలతో కలిసి.. చంద్రబాబు.. ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ కు నడుచుకుంటూ వెళ్లారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై రాష్ట్రపతికి వినతిపత్రం అందించారు. విభజన హామీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పారని.. గెలిచి అధికారంలోకి వచ్చిన విభజన హామీలను కేంద్రం విస్మరించిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీ ప్రజల న్యాయమైన డిమాండ్లు అమలుచేయాలన్నారు. ఏపీకి నిధులు విడుదల చేయకుండా కేంద్రం కాలక్షేపం చేసిందని ఫిర్యాదు చేశారు. విభజన తర్వాత ఇబ్బందులు ఉంటాయని రాష్ట్రపతి అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కొత్త రాష్ట్రం కాబట్టి కింది స్థాయి నుంచి … రాష్ట్ర నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్న రాష్ట్రపతి కోవింద్ ముఖ్యమంత్రితో వ్యాఖ్యానించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతితో భేటీ తర్వాత చంద్రబాబు… మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ప్రధాని మోదీలో నాయకత్వ లక్షణాలు లేవని తేల్చి చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనా మోదీకి లేదన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని చూసి ఎంతో మంది కలతచెందారని.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వికలాంగుడు… అర్జున్‌రావు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది.. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందన్నారు. ఢిల్లీ దీక్షతో ఏపీ ప్రజల బాధను దేశం మొత్తం తెలియజేశామని.. పార్లమెంట్లో నిరంతరం పోరాటం చేస్తున్నామన్నారు.
మోడీకి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదుని హెచ్చిరంచారు. దేశాన్ని కాపాడేందుకే నాతో అందరూ కలిసి వస్తున్నారన్నారు. కానీ అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వలేదు.. వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి పార్లమెంట్ నుంచి పారిపోయారని విమర్శించారు. దేశంలో సామాజిక న్యాయం పాటించే ఏకైక పార్టీ టీడీపీనేనన్నారు. ఏపీలో ధర్మపోరాట దీక్ష చేస్తాం, జాతీయ నేతలను ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఏపీ పర్యటనలో మోడీకి ప్రోటోకాల్ పాటించలేదని వచ్చిన విమర్శలపై చంద్రబాబు మడిపడ్డారు. సీఎస్, డీజీపీ, కలెక్టర్ వెళ్లి ప్రధానికి స్వాగతం పలికారని గుర్తు చేశారు. ఏపీకి అన్యాయం చేసినందుకే నేను వెళ్లలేదన్నా రు. బీజేపీ నేతలకు తప్పుడు ప్రచారం చేయడం అలవాటైందని విమర్శించారు.