హైదరాబాద్: ఈనెల 25న దేశవ్యాప్తంగా జరిగే ఆలిండియా ప్రీ మెడికల్ టెస్ట్‌కు హాజరయ్యే అభ్యర్థులకు డ్రెస్ కోడ్ విషయంలో సీబీఎస్ఈ విచిత్రమైన నిబంధనలు విధించింది. ఉంగరాలు, బ్రాస్లెట్లు, చెవిపోగులు, ముక్కుపుడకలు, పతకాలువంటి ఆభరణాలేవీ వేసుకురాగూడదని నిర్దేశించింది. హాఫ్ స్లీవ్స్ ఉన్న తేలికపాటి షర్ట్స్, టీషర్ట్స్, కుర్తాలవంటి దుస్తులు ధరించిరావాలని, వాటికి పెద్ద గుండీలు, పతకాలు ఉండగూడదని , స్లిప్పర్స్ మాత్రమే వేసుకోవాలని, షూస్ వేసుకోడదనికూడా తెలిపింది. కింద ప్యాంట్లు, సల్వార్లు వేసుకోవాలని సూచించింది. మొబైల్ ఫోన్స్, బ్లూటూత్ పరికరాలు, ఇయర్ ఫోన్స్, హెయిర్ బ్యాండ్, బెల్టులు, టోపీలు, స్కార్ఫ్‌లు వంటివాటితో వస్తే ప్రవేశముుండదని తెలిపింది.
దేశవ్యాప్తంగా 2,000 మెడికల్ సీట్లకోసం సీబీఎస్ఈ నిర్వహించే ఈ ప్రవేశ పరీక్ష వాస్తవానికి ఈ ఏడాది మే 3న జరిగింది. 6.3 లక్షలమంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. అయితే పరీక్షలో తీవ్రస్థాయిలో అక్రమాలు చోటుచేసుకోవటంతో సుప్రీం కోర్టు ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని సీబీఎస్ఈని ఆదేశించింది.