ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు ఇచ్చే అవార్డు వేడుకలు చూడండి. వాళ్లంతా చాలా మందికి అవార్డులు ఇస్తారు. కానీ అందుకోవడానికి అందులో సగం మంది కూడా రారు. కేవలం పేరుకి మాత్రమే అవార్డులు. వాళ్ల పేరు మీద మరొకరు వేదికపై ఆ పురస్కారాల్ని అందుకుంటారు. ఓ అవార్డు ఫంక్షన్‌కి ఓ స్టార్‌ని తీసుకురావడం గగనం అయిపోతుంటుంది. కానీ సుబ్బరామిరెడ్డి ఫంక్షన్లు మాత్రం భిన్నంగా జరుగుతుంటాయి. ఇంటింటికీ ఓ అవార్డు.. అన్నట్టు – చిత్రసీమలోని ప్రతీ కుటుంబానికీ ఓ అవార్డు ఇస్తుంటారాయన. అందుకోవడానికి హీరోలూ వచ్చేస్తుంటారు. టీఎస్ఆర్ అవార్డు వేడుక ఆదివారం రాత్రి విశాఖపట్నంలో జరిగింది. దాదాపు 15 మంది హీరోలు 20 మంది హీరోయిన్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు.. ఇలా స్టార్లంతా ఒకే వేదికపై కనిపించారు. కథానాయికలకైతే లెక్కేలేదు. సౌత్ ఇండియాలోని హీరోయిన్లంతా దర్శనమిచ్చారు. బాలీవుడ్ నుంచి విద్యాబాలన్, బోనీకపూర్‌లు సైతం వచ్చారు. ఏ అవార్డూ ఫంక్షన్లోనూ ఇలా గుంపులు గుంపులుగా హీరోలు కనిపించరు. పైగా ఈ కార్యక్రమానికి మేం అతిథిగా వచ్చాం.. అన్న ఫీలింగ్ హీరోల్లో ఉండదు. అవార్డు కార్యక్రమం అయ్యేంత వరకూ హీరోలంతా సుబ్బరామిరెడ్డితో పాటు వేదికపై ఉన్నారు. వేదిక అంతా రసాభసగా మారినా.. ఎవ్వరూ కిక్కురుమనరు. ఏ ఫంక్షన్లోనూ ఇలాంటి చిత్ర విచిత్రాలు జరగవు. సుబ్బరామిరెడ్డికి మాత్రమే ఎందుకు సాధ్యమైంది. ఆయన అవార్డు ఇస్తానంటే.. అందరూ ఇలా ఎందుకు క్యూ కడుతున్నారు..??
ఇదంతా సుబ్బరామిరెడ్డి మాయ. ఆయన సినీ పరిశ్రమకు చాలా ఆప్తుడు. ఎవరికి ఏ పని కావాలన్నా… చేసి పెడతాడు. ఢిల్లీ స్థాయిలో ఆయన పలుకుబడిని ఉపయోగించి, స్టార్స్‌ని ఆదుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమంది హీరోలకు పద్మ అవార్డులు రావడంలో సుబ్బరామిరెడ్డి పాత్ర చాలా ఉంది. అందుకే సుబ్బరామిరెడ్డి ఏ ఫంక్షన్‌కి పిలిచినా, ఎలాంటి అవార్డు కార్యక్రమం నిర్వహించినా హాజరు ఈ స్థాయిలో ఉంటుంటుంది.