ఆన్ లైన్ లో జూదం విజృంభిస్తోంది. రమ్మీ, డ్రీమ్ 11 ఇలా.. రకరకాల పేర్లతో… దర్జాగా వెలిగిపోతోంది. దీని ప్రచారానికి స్టార్ హీరోలు, క్రికెటర్లు కూడా దిగిపోతున్నారు. ఆన్ లైన్ జూదాన్ని నిషేధించాలని కొంతకాలంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా.. ఆన్ లైన్ రమ్మీని నిషేధించాలంటూ తమిళనాడు హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలు అయ్యింది. దానిపై న్యాయ స్థానం విచారణ చేపట్టింది. ఆన్ లైన్లో జూదం ఆడుతూ, చాలా మంది లక్షలు పోగొట్టుకుంటున్నారని, కొంతమంది అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటీషన్లో పేర్కొన్నారు. అంతేకాదు… వీటి ప్రచారంలో స్టార్ హీరోలు, క్రికెటర్లు పాల్గొంటున్నారని, వాళ్లని చూసి యువతరం జూదంపై మోజు పెంచుకుంటోందని ఆ పిటీషన్లో ప్రస్తావించారు.
ఆన్ లైన్ రమ్మీ, డ్రీమ్ 11 ప్రచారం చేస్తున్న సెలబ్రెటీలలో తమన్నా, రానా, సుదీప్, ప్రకాష్ రాజ్, కొహ్లి, గంగూలీ లాంటివాళ్లున్నారు. వీళ్లందరికీ ధర్మాసనం నోటీసులు పంపింది. యువతరాన్ని జూదం ఆడేలా ప్రేరేపిస్తున్నారని, దీనిపై సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అసలు ఆన్ లైన్ జూదాన్ని నిషేధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, లేదా? అని తమిళ నాడు ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు డ్రీమ్ 11ని నిషేధించాయి. మిగిలిన రాష్ట్రాలూ ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. కోర్టు అక్షంతలు వేసిన నేపథ్యంలో.. ఇకపై సెలబ్రెటీలూ ఇలాంటి వాటికి ప్రచారం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిందే.