పైరసీలా… మార్ఫింగ్ కూడా ఓ భూతంలా మారుతోంది. తాజాగా రష్మిక వీడియో వైరల్ అవ్వడంతో మార్ఫింగ్ ఏ స్థాయిలోకి చేరిందో అందరికీ అర్థమైంది. దీన్నుంచి చిత్రసీమనీ, కథానాయికల ఇమేజ్‌నీ కాపాడాల్సిన అవసరం ఉందని అందరూ గుర్తిస్తున్నారు. అందుకే ఒకొక్కరుగా నోరు విప్పుతున్నారు. రష్మిక విషయంలో అన్యాయం జరిగిందని అమితాబ్ బచ్చన్ సైతం వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ తరవాత నిర్మాతలు, హీరోలు, దర్శకులూ ఒకొక్కరుగా తమ సంఘీభావం వ్యక్తం చేస్తూ వచ్చారు. విజయ్ దేవరకొండ కూడా గొంతు విప్పాడు. ఈ విషయాన్ని అందరూ సీరియస్‌గా తీసుకోవాలని, తక్షణం చర్యలు చేపట్టాలని, మరో అమ్మాయి మార్ఫింగ్ తో బాధ పడకూడదని హితవు పలికాడు. హీరోయిన్లంతా కలిసి కట్టుగా ఉండాల్సిన సమయం ఉంది. ఎందుకంటే మార్ఫింగ్ వల్ల వాళ్లకే ఎక్కువ డామేజీ జరుగుతోంది.
అయితే ఇవన్నీ మాటలకే పరిమితం కాకూడదు. మార్ఫింగ్ కి పాల్పడిన వాళ్లకు శిక్ష తప్పదు అనేది నిరూపించడానికైనా బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టాలి. ఒకరికో ఇద్దరికో శిక్ష పడితే… కాస్త సీరియస్‌నెస్ కనిస్తుంది. అయితే సైబర్ క్రైమ్ చట్టాలు అంత తేలిగ్గా అర్థమయ్యేవి కావు. ఇందులోనూ చాలా లొసుగులు ఉన్నాయి. వాటికి అడ్డు పెట్టుకొనే ఇలాంటి వాళ్లు బరితెగిస్తుంటారు. `మా` లాంటి సంస్థలు కొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పైరసీ బాధ విపరీతంగా ఉన్న రోజుల్లో మాలో పైరసీ సెల్ సమర్థవంతంగా పని చేసింది. దానిపై అవగాహన కల్పించి, పైరసీ దారుల్ని పట్టుకోవడంలో ప్రభుత్వానికి తన వంతు సహాయం చేసింది. ఇప్పుడు కూడా అలాంటి ఓ సెటప్ ఏర్పాటు చేయాల్సిన అవసరం `మా`కు ఎంతైనా ఉంది. మా కోసం బిల్డింగ్ కట్టడం ఎంత ముఖ్యమో… `మా` సభ్యుల ప్రతిష్టని నిలబెట్టడం కూడా అంతకంటే ముఖ్యం. ఈ విషయంలో `మా` ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో చూడాలి.