హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు హీరోలుగా మారడం, స్టార్లుగా ఎదగడం చూస్తూనే ఉన్నాం. రచయితల కుమారులు, మనవళ్లు హీరోలవ్వడం చాలా అరుదు. అయితే ఇప్పుడు సీనియర్ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ కథానాయకుడిగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. ‘మిస్టర్ సెలబ్రెటీ’ సినిమాతో. ”నీకు తెలిసింది మాట్లాడడం స్వేచ్ఛ..తెలియనిది మాట్లాడ్డం నేరం” అనే క్యాప్షన్‌తో రూపొందిన సినిమా ఇది. వాక్ స్వాతంత్ర్యం, మీడియా స్వేచ్ఛ పేరుతో గాసిప్పులు ప్రచారం చేసి, సెలబ్రెటీ జీవితాలతో ఆడుకొనే మీడియా తీరుపై సెటైరికల్ గా తీసిన సినిమా ఇది. టీజర్ చూస్తే యాక్షన్ తో పాటు, థ్రిల్లింగ్ అంశాల్ని మేళవించారనిపిస్తోంది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించడం విశేషం. వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించారు. టీజర్లో ఆమె ఎంట్రీ కూడా ఆసక్తిని రేపింది. రఘుబాబు, నాజర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మీడియాపై సినిమా కాబట్టి సమకాలీన పరిస్థితులు, ఇటీవల ముసిరిన వివాదాలూ తెరపై చూసే అవకాశం ఉంది. సి. రవికిషోర్ బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
పరుచూరి వెంకటేశ్వరరావు తనయుడు పరుచూరి రవీంద్రనాథ్ హీరోగా ప్రయత్నించాడు. ఆయన్నుంచి ‘జంక్షన్’లాంటి సినిమాలు వచ్చాయి. కానీ నిలదొక్కుకోలేదు. తమ కుటుంబం నుంచి ఓ హీరో చిత్రసీమలో రాణించాలన్నది పరుచూరి బ్రదర్స్ కల. దాన్ని మనవడు సుదర్శన్ నిలబెడతాడేమో చూడాలి.