పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. ఎలాగైనా విచారణ జరిపించాలనుకుటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. కేంద్రం నిరాశజనకమైన వార్త చెప్పింది. పోలవరం పనుల్లో అవకతవకలు జరిగినట్టు మాకు నివేదికలు రాలేదని… సీబీఐ విచారణకు ఆదేశించే అవకాశం లేదని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేశారు. పోలవరం విషయంలో చంద్రబాబు సర్కార్కు క్లీన్ చిట్ ఇప్పించేలా ప్రశ్న వేసింది ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డే. పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పునర్నిర్మాణంలో… పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని… సీబీఐ విచారణకు ఆదేశించే ఆలోచన ఉందా అని… విజయసాయిరెడ్డి పార్లమెంట్లో ప్రశ్న వేశారు. దీనికి కేంద్రం సూటిగా సుత్తిలేకుండా సమాధానం చెప్పింది. అవినీతి జరిగినట్లు నివేదికలు లేవు కాబట్టి.. సీబీఐ విచారణ అనే ప్రశ్నే రాదని తేల్చింది.
అయితే.. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం… తన ప్రభుత్వ ప్రకటనతోనే విబేధించారు. మంత్రి సమాధానం చెబుతున్న సమయంలో… ఏమీ మాట్లాడకుండా ఉండిపోయిన ఆయన బయటకు వచ్చి.. పోలవరంపై ఆరోపణలు గుప్పించారు. పునరావాస ప్యాకేజీలో భారీగా ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. లేని ఇళ్లను ఉన్నట్టుగా చూపి నష్టపరిహారం తీసుకున్నారని.. చెట్లు, ట్యూబ్వెల్స్ పేరుతో ఆర్అండ్ఆర్ ప్యాకేజీలో భారీగా డబ్బు దోచేశారని.. ఆరోపణలు గుప్పించారు. ఈ అక్రమాలపై మోదీని, కేంద్రమంత్రులను కలుస్తానని కూడా ప్రకటించారు.
మరో వైపు.. విజయసాయిరెడ్డి వేసిన ప్రశ్నలోనే.. పోలవరం అంచనాలపై కూడా ప్రశ్న ఉంది. ఇందులో.. కేంద్ర మంత్రి షాకింగ్ విషయం బయట పెట్టారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్రమంత్రి తేల్చి చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు సర్కార్.. మోడీ ప్రభుత్వంతో తీవ్రంగా వ్యతిరేకించింది. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కనీసం రూ. 35 వేల కోట్లు అవసరం అవుతాయి. అంత పెద్ద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించే పరిస్థితుల్లో లేదు. చట్టం ప్రకారం.. ప్రాజెక్ట్ నిర్మాణానికి వంద శాతం నిధులు… కేంద్రం భరించాల్సి ఉంది. అయితే.. కేంద్రం ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే.. సిమెంట్ నిర్మాణంగానే చూస్తోంది. ముంపు ప్రాంతాలను ప్రాజెక్ట్ లో భాగంగా చూడటానికి అంగీకరించడం లేదు. దీంతోనే అసలు సమస్య వస్తోంది. అంచనాలను ఆమోదించుకుని.. ఆ మేరుక నిధులు పొందాల్సిన ఏపీ సర్కార్ కు విజయసాయిరెడ్డి ప్రశ్నతో షాకింగ్ ఆన్సర్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చే్సతామన్న ఏపీ సర్కార్ ఇప్పుడేం చేస్తుందో మరి..!