విభజన సమస్యలపై కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఇలాంటి సమావేశాలు చాలా జరిగాయి. కానీ పైసా ప్రయోజనం రెండు రాష్ట్రాలకూ జరగలేదు. అలాంటిదో మరో సమావేశం జరుగుతుంది. అయితే ఇందులో ఎజెండా మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే ఇందులో రాజధాని అంశాన్ని చేర్చారు. కొత్త రాజధానికి నిధులు అనే టాపిక్ పెట్టారు. విభజన చట్టంలో ఏపీకి నిర్మించబోయే రాజధానికి నిధులు భరించాలనే నిబంధన ఉంది. దాని ప్రకారం ఈ సమస్యపైనా చర్చించేందుకు కేంద్రం అందులో పెట్టింది.
విభజన చట్టంలో మూడు రాజధానులు అని లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోమూ మూడు రాజధానులు అని పెట్టే చాన్స్ లేదు. దానికే కాదు చట్ట పరంగా కూడా ఆ నిర్ణయం తేలిపోయింది.. కాబట్టి కేంద్రం అలా పెట్టి ఉంటే .. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు అయ్యేది. అయితే ఒక్క రాజధానే అని ఉందని..కొంత మంది ఏపీ నుంచి సంబరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం గతంలోనే అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. కేంద్రం నోటిఫై చేసింది. మ్యాప్‌లోనూ గుర్తించింది.
ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇంత చేసిన తర్వాత కూడా ఎందుకు రాజధాని అమరావతికి నిధుల అంశం అని ప్రస్తావించలేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజధానిగా గుర్తించడమే కాదు.. నిజానికి రూ. పదిహేను వందల కోట్ల నిధులు కూడా కేంద్రం ఇచ్చింది. ఇంకా వెయ్యి కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాజధాని అమరావతికి నిధులు అని చెప్పి ఉంటే కేంద్రంపై అనుమానాలు వచ్చేవికావు.
రేపు సమావేశంలో అయినా రాజధానిని అమరావతిగా గుర్తించి ఇప్పటికే నిధులిచ్చాం కాబట్టి అదే రాజధాని అని స్పష్టం చేయాలి. చట్టపరంగా .. రాజ్యాంగపరంగా తేలిపోయినా మూడు రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభుత్వానికి క్లారిటీగా చెప్పాలి.. లేకపోతే కేంద్రం తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేయక తప్పదు.