అగ్నిపథ్ స్కీమ్ లో మార్పులు చేసేందుకు కేంద్రం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఈ స్కీమ్ పై స్వపక్షం నుంచి డిమాండ్లు వస్తుండటం..విపక్షం నుంచి విమర్శల మోత మోగుతుండటంతో మార్పులు చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి 2022లో అగ్నిపథ్ ను కేంద్రం తీసుకొచ్చింది. అగ్నిపథ్ నిబంధనల ప్రకారం 17 నుంచి 21ఏళ్లు ఉన్న వారిని మాత్రమే అగ్ని వీరులుగా విధుల్లోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత 25శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకోగా.. మిగతా 75 శాతం మందిని విధుల నుంచి తప్పిస్తారు. దీంతో కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన ఈ అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం అగ్నిపథ్ స్కీమ్ లో మార్పులు చేయలని కేంద్రం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. నాలుగు ఏళ్ల తర్వాత సైన్యంలో 25శాతం మందిని మాత్రమే రెగ్యులర్ సర్వీసులోకి కాకుండా ఆ సంఖ్యను రెట్టింపు చేయాలని , వయోపరిమితిని కూడా 23 ఏళ్ల కు పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
అగ్నివీర్ లుగా 25 శాతం మందినే తిరిగి విధుల్లోకి తీసుకుంటే సైనిక బలం తగ్గుతుందని దానిని నివారించేందుకు మరికొంతమందిని తీసుకోవాలని ఆర్మీ ఉన్నాతాధికారుల సూచనలతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.