అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని కొండంత ఆశతో ఉన్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు. ఇదే విషయమై ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్తూ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తూ వస్తున్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టేయడం ఖాయమనీ, అధికార పార్టీ ఎంపీలు అందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్యనే ప్రకటించారు. ఇదే పనిమీద తాజాగా ఢిల్లీ వెళ్లారు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు! కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. చంద్రబాబు, కేసీఆర్ లు వేర్వేరుగా రాజ్ నాథ్ తో సమావేశమై చర్చించారు. సీట్ల సంఖ్య పెంపుపై హోం శాఖ బిల్లు తయారు చేసేసిందని హోం మంత్రి చెప్పారు. అయితే, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అంతిమ నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, ఆ తరువాతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతారనే మెలిక పెట్టడం విశేషం!
నిజానికి, రెండు రోజుల కిందటే తెరాస ఎంపీలు ఇదే విషయమై రాజ్ నాథ్ ను కలిసి చర్చించారట. అప్పుడు కూడా ఇదే మాట చెప్పారని సమాచారం. రాజ్ నాథ్ తో సమావేశమైన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అయితే, చంద్రబాబు నాయుడు మాత్రం మీడియాతో మాట్లాడారు. ఇదే అంశమై ప్రధానమంత్రి, అమిత్ షాలతో తాను మాట్లాడతానని చెప్పారు. అయితే, ఆ వెంటనే భాజపా అధ్యక్షుడు అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, ఆయన అపాయింట్మెంట్ దొరకలేదు. మళ్లీ త్వరలోనే ఢిల్లీ వచ్చి ప్రధాని, అమిత్ షాలతో చర్చిస్తానని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. నియోజక వర్గాల పునర్విభజన విషయమై మాట్లాడాలని అమిత్ షాను కోరితే.. ఆయనే చంద్రబాబుకు సమయం ఇవ్వలేదని కూడా ఓ కథనం!
మొత్తానికి, తెలుగు రాష్ట్రాల్లో నియోజక వర్గాల పెంపు ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యేట్టుగానే కనిపిస్తోంది. కొన్నాళ్లపాటు న్యాయ సలహా పేరుతో కేంద్రం తాత్సారం చేసింది. ఇంకొన్నాళ్లు రాజ్యాంగాన్ని సవరించాలా వద్దా, సవరిస్తే ఎలా అనే చర్చ పేరుతో ఇంకొన్నాళ్లు టైం పాస్ చేశారు. మొత్తానికి, బిల్లు రెడీ చేసిన న్యాయ శాఖ, హోం శాఖకు పంపించిందన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టడానికి నోట్ సిద్ధమైపోయిందనీ అన్నారు! అంతా జరిగిపోయింది అనుకున్న ఈ తరుణంలో… ముందు రాజకీయ నిర్ణయమే జరగాలని హోం మంత్రి చెప్పడం మెలిక పెట్టడమే అవుతుంది! తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్య విషయంలో భాజపా మీన మేషాలు లెక్కిస్తోందని అర్థమౌతోంది. టీడీపీ, తెరాసలతో భవిష్యత్తులో ఎలాంటి బంధం ఉండబోతోందన్న క్లారిటీ కోసం భాజపా వేచి చూస్తున్నట్టుగా ఉంది. ఆ విషయంలో క్లారిటీ వచ్చేంత వరకూ సీట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం జరగకపోవచ్చనీ కొంతమంది అభిప్రాయపడుతున్నారు.