ఆర్.ఆర్.ఆర్.. వాయిదా పడడంతో బంగార్రాజుకి దారులు తెరచుకున్నాయి. ఈ సంక్రాంతికి రావాలా? వద్దా? అనే డైలామాలో ఉన్న బంగార్రాజు.. ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడంతో ఇక ఎలాంటి అడ్డూ లేకుండా పోయింది. ఈరోజే బంగార్రాజు టీజర్ విడుదలైంది. సంక్రాంతికి సిద్ధమంటూ ప్రకటించింది. అయితే.. డేట్ మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. సంక్రాంతికి రావాలన్న ఉద్దేశ్యంతోనే ఆఘమేఘాల మీద పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయిస్తున్నారు. కాకపోతే… ఒక్కటే ఇబ్బంది. ఈ సినిమాలో సీజీ వర్క్ చాలా పెండింగ్ లో ఉన్నాయి. అది ఎప్పటికి పూర్తవుతుందన్న విషయంలో క్లారిటీ లేదు. అయినప్పటికీ… రెండు మూడు స్టూడియోలో 24 గంటల పాటూ శ్రమిస్తూ సీజీ వర్క్ ని పూర్తి చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సీజీ చాలా ముఖ్యం. ఆయా సన్నివేశాలు సరిగా రాకపోతే… నెగిటీవ్ మార్క్ పడే ప్రమాదం ఉంది. సీజీకి టైమ్ పడుతుందని చిత్రబృందానికి ముందే తెలుసు. అందుకే సంక్రాంతికి రావాలా వద్దా? అంటూ ఊగిసలాడింది. ఆర్.ఆర్.ఆర్, రాధే శ్యామ్ లాంటి పెద్ద సినిమాల మధ్య ఎందుకు? అనే ఆలోచనలో ఉన్నా.. సడన్ గా ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడంతో.. బంగార్రాజు సీజీ పనులు మరింత వేగంగా జరిపిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో.. సీజీ పనులపై ఓ క్లారిటీ వస్తుంది. ఆ తరవాతే రిలీజ్డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా ప్రమోషన్లను జోరుగా చేయాలని చూస్తోంది. జనవరి 15న ఈ సినిమా విడుదలయ్యే ఛాన్సుంది. సీజీ పూర్తయిపోతే.. జనవరి 12నే రావొచ్చు.