తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలు లెక్కల పంచాయతీని తెగకుండా సాగదీసుకుంటూనే ఉన్నాయి. తాము తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని మోదీనో అమిత్ షాతో సందర్భం వచ్చినప్పుడు చెబుతూంటారు. అదంతా అబద్దమని.. ఇచ్చినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేస్తామని.. ముక్కుకు నేలకు రాస్తామని టీఆర్ఎస్ అగ్రనేతలు సవాళ్లు చేస్తూంటారు. ఇది గత ఆరేడేళ్లుగా సాగుతూనే ఉంది. కానీ ఎవరూ లెక్కలు బయట పెట్టడం లేదు. ఎవరు లెక్కలు వారు చెబుతున్నారు కానీ రెండు వర్గాలూ అంగీకరించడం లేదు.
తాజాగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో తము రూ. రెండున్నర లక్షల కోట్లు ఇచ్చామని అమిత్ షా ప్రకటించారు. దీనిపై కేటీఆర్ స్పందించారు. అంత ఇచ్చి ఉంటే తాను రాజీనామా చేస్తానన్నారు. వెంటనే బండి సంజయ్ అందుకున్నారు. రాజీనామాకు రెడీకావాలన్నారు. కానీ నిధుల వివరాలు మాత్రం బయట పెట్టలేదు. కేంద్రం ఇచ్చినట్లుగా చెబుతున్న రూ. రెండున్నర లక్ష కోట్ల వివరాలను బయట పెట్టడం ఎంత సేపు ? కానీ అలా పెట్టకుండా వీలైనంతగా రాజకీయం చేస్తూనే ఉన్నారు.
అసలు తెలంగాణకు ఇచ్చిందేమీ లేదు.. తెలంగాణ నుంచి తీసుకున్నదే ఎక్కువని టీఆర్ఎస్ వాదిస్తూ ఉంటుంది. తెలంగాణ నుంచి ఎంత పన్నులు వసూలు చేశారు.. తిరిగి పన్నుల వాటా కింద ఎంత తిరిగిచ్చారు అన్న లెక్కల్ని గతంలో బయట పెట్టారు. అయితే కేంద్ర పథకాలు.. జాతీయరహదారులు.., జాతీయప్రాజెక్టుల కింద తెలంగాణలో ఖర్చు పెట్టింది.. రాష్ట్రానికి కాదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. నిజానికి అసలు ఎవరు ఎవరికి ఇస్తున్నారో అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్ అగ్రనేతలకు తెలుసు. ఎందుకంటే వారు అధికారాల్లో ఉన్నారు. కానీ వారు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ప్రజలతో రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంమే అర్థం కాక.. రెండుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో వాదులాడుకుంటూ వస్తున్నారు.