ఆంధ్రప్రదేశ్‌లో కొత్త తరహా రాజకీయం జరుగుతోంది. టీడీపీ అభ్యర్థులతో పోటీ నుంచి విరమింప చేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. నామినేషన్ల గడువు చివరికి వచ్చింది. ఇప్పటికీ.. దాదాపుగా పది మంది టీడీపీ అభ్యర్థులపై కొన్ని శక్తులు గురి పెట్టాయని చెబుతున్నారు. నామినేషన్లు వేసిన తర్వాత ఉపసంహరించుకునేలా చేయడమో… లేకపోతే ఆజ్ఞాతంలోకి వెళ్లడమో చేసి.. టీడీపీని నైతికంగా దెబ్బకొట్టాలన్న ఆలోచన చేస్తున్నారంటున్నారు. అన్నింటికీ తెగించి… పోటీకి సిద్ధమైన వారిపై.. ఇన్‌కంట్యాక్స్ దాడులు జరుగుతాయనే ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా.. ఇదే మాట చెబుతున్నారు. విజయనగరం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన… టీడీపీ అభ్యర్థులపై ఐటీ దాడులు జరిపేందుకు సిద్ధమవుతున్నారని మండి పడ్డారు.
కర్ణాటక ఎన్నికల సమయంలో ఓ వంద మందికిపైగా ఐటీ బృందం.. అక్కడ మకాం వేసింది. ఒక్కరంటే.. ఒక్క బీజేపీ నేత ఇంటిపైనా.. ఆ ఐటీ బృందం దాడి చేయలేదు. కానీ.. కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరినీ వదిలి పెట్టలేదు. చివరికి ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య బస చేసిన ఓ రిసార్ట్‌లోనూ సోదాలు చేశారు. ఆ తర్వాత తమిళనాడులో పెద్ద ఎత్తున సోదాలు చేశారు. రాజకీయంగా లొంగని వారిని ఆ దాడులతో దారిలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే చేస్తారని..ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే… విజయనగరం జిల్లాతో పాటు మరో చోట.. టీడీపీలో కీలకంగా వ్యవహరించే నేతల ఇళ్లలో సోదాలు జరిగాయి. ముందు ముందు ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది.
సాధారణం అధికార పార్టీ అంటే… ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ.. ఏపీలో టీడీపీ పరిస్థితి అలా లేదు. అధికారం చేతిలో ఉన్నా… ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా.. ధీమాగా ఉండాల్సిన వారు.. రాష్ట్రం బయట నుంచి వస్తున్న హెచ్చరికతో కూడిన సూచనల్లాంటి సలహాలతో ఉక్కిరిబిక్కిరయిపోతున్నారు. కానీ అధికారపక్షం ఎంత దిలాసాగా ఉండాలో.. ప్రతిపక్షం అంత హాయిగా ఉంటోంది. వారిపై ఎలాంటి ఐటీ దాడుల హెచ్చరికలు లేవు. వారి అభ్యర్థులపై ఒత్తిళ్లు కూడా లేవు.