‘టెక్నాలజీని ప్రోత్సహించి అభివృద్ధికి మనం వాడుతుంటే, సైబర్ నేరాల కోసం వైకాపా టెక్నాలజీని వాడుతోంద’ని మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ.. ఈ చర్యల ద్వారా ఎన్నికల ముందే వైకాపా ఓటమిని అంగీకరించిందన్నారు. టీడీపీని ఏం చెయ్యలేని ఫ్రస్ట్రేషన్ తో తెలంగాణలో కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీకి సంబంధించి సేకరించి దాచుకున్న సమాచారాన్ని కొట్టేయడం కోసం వైకాపా దిగజారుడు చర్యలకు దిగుతోందని విమర్శించారు. వారు చేస్తున్న నీచమైన పనికి కోర్టు కూడా మొట్టికాయలు వేసిందన్నారు. ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని వైకాపాకి స్పష్టమైపోయిందనీ, అందుకే కేసీఆర్, మోడీలతో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ సీఎం ఆరోపించారు. దాదాపు 8 లక్షల ఓటర్లను తొలగించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందనీ, దీన్ని సమర్థంగా తిప్పికొడతామన్నారు సీఎం.
తాజా వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నారు ముఖ్యమంత్రి. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలకు అవకాశం ఉందనేది సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. డీజీపీ, అడ్వొకేట్ జనరల్ తో సీఎం చంద్రబాబు భేటీ అయి, దాదాపు గంట సేపు డాటా చోరీ అంశమై ఎలాంటి చర్యలకు వెళ్లొచ్చనేది చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని పార్టీపరంగా కూడా డీల్ చేసేందుకు నేతలకు చంద్రబాబు కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. పార్టీకి సంబంధించిన డాటా ఎంత కీలకమైందో, దాన్ని చోరీ చేసేందుక వైకాపా ఎలాంటి కుటిల రాజకీయాలు చేస్తోందో ముందుగా పార్టీలో అన్ని స్థాయిలవారికీ వివరించాలని దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. టీడీపీ డాటాను దొంగిలించి, దాన్ని వైకాపాకి అందజేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న కుట్రని ప్రజలకు వివరించాలని సీఎం చెప్పినట్టు సమాచారం.
తెరాస సాయంతో, ఓట్ల తొలగింపునకు ఫామ్ 7 దరఖాస్తులను పెద్ద సంఖ్యలో వైకాపా దాఖలు చేసిందనేది టీడీపీ అనుమానం. కాబట్టి, ఓటర్ల జాబితాకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి, ఈ ప్రహసనంలో వైకాపా విమర్శలు ఎదుర్కొనే దిశగా తెలుగుదేశం వ్యూహం ఉండబోతోందని అనిపిస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలుంటే… కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చెయ్యాలి. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డాటా లీక్ అవుతోందని అనుమానం ఉంటే… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఫిర్యాదు చెయ్యాలి. ఈ రెండూ కాదని… తెలంగాణ ప్రభుత్వానికి వైకాపా ఫిర్యాదు చేయడం వెనక ఉద్దేశమేంటి..? ఈ ప్రశ్నకు వైకాపా జవాబు చెప్పి తీరాల్సిన అవసరం ఏర్పడుతోంది.