అభివృద్ధి చేయడం కోసమే అధికారంలోకి వచ్చామనీ, ప్రజలు తమకు అవకాశం ఇచ్చింది కూడా అందుకేనని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. అయితే, గత కొన్నాళ్లుగా ఆయన వాదన జాగ్రత్తగా గమనిస్తే… రాష్ట్ర అభివృద్ధి కోసం ‘అన్ని చేశాం ఇన్ని చేశాం’ అని చెప్పుకునే కంటే, అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రల జరుగుతున్నాయన్న స్వరంలోనే ఎక్కువగా మాట్లాడుతున్నారు! అడ్డుకుంటున్నది ఎవరంటే.. ప్రతిపక్ష పార్టీ వైకాపా! రాష్ట్రంలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు తాజాగా మరోసారి ఆరోపించారు. కర్నూలు జిల్లాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మరోసారి అభివృద్ధి నిరోధక ట్యాగ్ ను వైకాపాకి తగిలించే ప్రయత్నం చేశారు.
రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని తాము అనుకుంటే, అక్కడ రైతుల్ని రెచ్చగొడుతున్నారని చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వాఫుడ్ ప్రాజెక్టు నిర్మిస్తుంటే.. అక్కడా ఇలాంటి ప్రయత్నమే చేసి ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గాలేరు – నగరి ద్వారా కడప జిల్లాకు నీటిని తీసుకొస్తున్నా, రైతుల కోసం కర్నూలు జిల్లాలో జైన్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను తీసుకొస్తున్నా.. ఇలా ప్రతీదానికీ అడ్డుపడుతూనే ఉన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇలా ఎక్కడా అభివృద్ధి జరక్కుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ శ్మశానానికి కాపలా కాస్తున్నారా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎవరు ఎన్నిరకాలుగా అడ్డంకులు సృష్టించినా అభివృద్ధి ఆగదనీ, బుల్లెట్ లా రాష్ట్రాన్ని దూసుకుపోయేలా చేస్తామనీ చంద్రబాబు చెప్పారు.
అభివృద్ధిని అడ్డుకోవాలని ఎవరు అనుకుంటారు..? అయితే, చంద్రబాబు ప్రయత్నం ఎలా ఉందంటే… తమ సర్కారు మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా ఆగిపోతే… అందుకు కారణం ప్రతిపక్షమే అనేది జనాల్లోకి ఇంజెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది! ఈ క్రమంలో వాస్తవాల్ని దాటేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని నిర్మాణాన్నీ ఎవ్వరూ అడ్డుకోవడం లేదు. కానీ, బలవంతపు భూసేకరణపై విమర్శలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో మెగా ఆక్వా ఫుడ్ ప్రాజెక్టును కూడా ఎవ్వరూ వ్యతిరేకించరు. కానీ, ప్రాజెక్టును వేరే ప్రాంతానికి మార్చాలన్న డిమాండ్ మాత్రమే అక్కడ వినిపిస్తోంది. ఎందుకంటే, ఆ ప్రాజెక్టు వ్యర్థాల వల్ల గోదావరి కాల్వలు కలుషితమౌతాయనీ, వాటిపై ఆధారపడి బతికే కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుందనేదే అక్కడి వ్యతిరేకత. మిగతా విషయాల్లో కూడా ఇలాంటి అభ్యంతరాలూ విమర్శలూ ఉన్నాయి.
అభివృద్ధిలో బుల్లెట్ లా దూసుకుపోవాలన్న చంద్రబాబు ప్రయత్నం ప్రశంసనీయమే. అయితే, ఈ క్రమంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. వాటిపై దృష్టి సారించకుండా… ఆ సమస్యను ప్రతిపక్షమే వెలుగులోకి తెచ్చింది కాబట్టి, ప్రతిపక్షం చెప్పిదాన్ని నిర్ద్వంద్వగా వ్యతిరేకించాలి కాబట్టి, వారి ఉద్దేశం అభివృద్ధిని అడ్డుకోవడమే అనేట్టుగా విమర్శించేస్తే ఎలా..? ఎక్కడ ఏది ఆగిపోయినా అది ప్రతిపక్షం అడ్డుకోవమే అని చెబుతూ పోవడం ఎంతవరకూ సమంజసం..? ఒకవేళ అదే జరిగే చర్యలు తీసుకోవచ్చు కదా! అధికారంలో ఉన్నది వారే కదా!