విశాఖపట్టణంలో జగన్ మహాధర్నా చేస్తున్పప్పుడే టివైసీపీ ప్లీనం జరుగుతున్నది. దానికి ఆయన ఎంత ప్రాధాన్యత నిచ్చింది అక్కడే తెలిసిపోతుంది. వైసీపీని తెలంగాణలో ఒక గట్టిగా పెంపొందించాలనే ఉద్దేశం లేనట్టే కనిపిస్తుంది. నియామకాల సమయంలో తప్ప మరే సందర్భంలోనూ జగన్ తెలంగాణ విషయాలపై మాట్లాడినట్టు కనిపించదు. ఆ పార్టీ ప్రతినిధిగా కొండా రాఘవ రెడ్డి టీవీ చర్చలకు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంటారు. తీవ్రంగా విమర్శిస్తుంటారు. గట్టు శ్రీకాంతరెడ్డి కూడా మాట్లాడుతుంటారు. కాని ముఖ్య నాయకత్వం ఎప్పుడూ దృష్టి పెట్టదు. ఇక్కడి ఈవెంట్లకు హాజరు కాదు. ఎపికే పరిమితం కావాలని వైసీపీ గట్టిగానే నిర్ణయించుకున్నది స్పష్టం. అయితే హైదరాబాదును గమనంలో వుంచుకుని బహుశా ఉనికిని కొనసాగిస్తున్నారు. వైసీపీకి టీఆర్ఎస్కు లోపాయికారి అవగాహన వుందనేది టిడిపి ఆరోపణ. రేపు ఒక వేళ పోటీ పెట్టినా అది ఓట్లు చీల్చడానికేనన్న నింద మోయవలసిందే.
నిజానికి టిటిడిపి పరిస్థితి కూడా ఇంతకన్నా మెరుగ్గా లేదు. కాకుంటే ఆ పార్టీ నాయకులు రేవంతరెడ్డి, ఒంటేరు ప్రతాపరెడ్డి వంటివారు గట్టిగా మాట్లాడుతూ పోట్లాడుతూ వస్తున్నారు. వారికి స్వంత గుర్తింపు కూడా వుంది.అయితే చంద్రబాబు నాయుడు సహకారం తప్ప స్వయంగా ఇక్కడ రంగంలోకి రావడానికి సిద్ధంగా లేరు. గతంలో వలె వనరులు సమయం కేటాయించేందుకు కూడా ఆయన సిద్ధపడటం లేదు. కేవలం పైసల కోసం విజయవాడ వెళ్లడం చికాకు తెప్పిస్తుందని సీనియర్ టిడిపి నేత ఒకరన్నారు. టిడిపికి ఇక్కడ యంత్రాంగం భవనాలు వున్నా గతంలోని వూపు లేదన్నది నిజం. దాన్ని పునరుద్ధరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నా అధిష్టానానికి అంతగా పట్టడం లేదట.బిజెపి కూడా వంటరిగా వెళ్లేట్టయితే టిడిపికి మరింత నష్టం తప్పకపోవచ్చు. వచ్చేఎన్నికల వరకూ టిటిడిపి పరిమితంగానే మిగిలిపోవడం అనివార్యం కావచ్చు.