ఏపీ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ శాఖ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో చాపరాయి ఘటనకు సంబంధించి సీఎం మరోసారి కీలకంగా చర్చించినట్టు తెలుస్తోంది. 16 మంది గిరిజనలు మరణించిన ఈ ఘటనపై మంత్రి వర్గంలో తీవ్రమైన చర్చ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అధికారుల తీరుపైనే సీఎం ప్రధానంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ముందుగా అలెర్ట్ చేసినా కూడా అక్కడి అధికారుల నుంచి ఆశించిన స్పందన రాలేదంటూ వైద్య ఆరోగ్య శాఖమంత్రి చెప్పారు. దీంతో ఈ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తి చేసినట్టు తెలుస్తోంది.
వైద్య ఆరోగ్య శాఖలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందన్న చర్చ ప్రారంభమైంది. అయితే, ఈ ఒక్క ఘటనను ప్రాతిపదికగా తీసుకుని సీఎం ఈ నిర్ణయం నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. గడచిన రెండు మూడు సమీక్ష సమావేశాల్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. వీటికి తోడు చాపరాయి ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో.. ఆ శాఖలో మార్పులు తప్పవనే అభిప్రాయం వినిపిస్తోంది.
దాదాపు ఐదు గంటలు సాగిన ఈ సమీక్షలో ప్రధానంగా చర్చకు వచ్చిన మరో అంశం.. మద్యం పాలసీ. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు ప్రభుత్వ అధికారులు ఎందుకు ముందుగా సిద్ధం కాలేకపోయారంటూ ఈ సందర్భంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జులై 1వ తేదీ నుంచీ పరిస్థితులు మారతాయని తెలిసినా కూడా ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేకపోయారంటూ క్లాస్ తీసుకున్నారు. ఇక, హైవేలకు దూరంగా మద్యం దుకాణాలు ఉండాలన్న గైడ్ లైన్స్ అమలు పరిణామాలపై కూడా ప్రధానంగా చర్చ జరిగింది. 500 మీటర్ల వెలుపలే దుకాణాలు ఉండాలన్న నిబంధనతో కొన్ని గ్రామాల్లోకి మద్యం షాపులు వెళ్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా గ్రామాల్లో ప్రజలు ఉద్యమిస్తున్నారు. కొన్ని చోట్ల ఘర్షణలు కూడా జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీనిపై కూడా సీఎం ఘాటుగానే స్పందించారని తెలుస్తోంది. గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నట్టుగా నివాసాల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలు ఉండొద్దని చంద్రబాబు ఆదేశించారు.
కోర్టు నియమావళిని అనుసరించే క్రమంలో ఇలాంటి సమస్యలు వస్తాయని ముందుగా ఎందుకు అంచనా వేయలేకపోయారంటూ సదరు శాఖ పనితీరుపైనా సీఎం ఆగ్రహించారట. ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే ఇలాంటి సమస్యలు ఉండేవి కాదు కదా అంటూ అధికారుల పనితీరును కూడా తప్పుబట్టినట్టు చెబుతున్నారు. మొత్తానికి, తాజా క్యాబినెట్ సమావేశంలో ఉన్నతాధికారుల తీరుపైనే ప్రముఖంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం!