దాదాపు ఒకే లాంటి అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలూ రెండు రకాలుగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం! మియాపూర్ భూకుంభ కోణాన్ని తామే బయటకి తెచ్చామని తెరాస సర్కారు చెప్పుకుంటూ చర్యలకు దిగింది. ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వ్యవహరిస్తోంది. ఇక, ఆంధ్రా విషయానికొస్తే.. విశాఖ భూదందా వ్యవహారం ఈ మధ్య వార్తల్లో ప్రముఖంగానే కనిపిస్తోంది. ఈ దందాలో బడాబాబులు ఉన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ మీడియాలో కథనాలూ వస్తున్నాయి. అయినా, తెలుగుదేశం సర్కారు నుంచి చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఈ వ్యవహారంలో చాలామంది పెద్దలు ఉన్నారంటూ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు స్వయంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ అంశంపై తాజాగా దృష్టి చంద్రబాబు మరోసారి సాధించారట. జిల్లా కలెక్టర్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది.
ఇదే అంశాన్ని ప్రధానాస్త్రంగా వైకాపా విమర్శలు చేస్తోంది. అనుభవం ఉన్న నాయకుడని, ఆంధ్రాని అభివృద్ధి చేయగరనే నమ్మకంతో చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని ఇస్తే, రాష్ట్రాన్ని ఇలా దోచుకుంటారా అంటూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సుమారు లక్ష ఎకరాల్లో టాంపరింగ్ జరిగిందనీ, దీనికి సంబంధించిన రికార్డులు కనిపించడం లేదంటూ జిల్లా కలెక్టర్ స్వయంగా చెప్పిన మాట వాస్తవమా కాదా అంటూ ఆయన నిలదీశారు. అంతేకాదు, ఈ కుంభకోణంలోకి ఏపీ మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ను కూడా లాగే ప్రయత్నం చేశారు బొత్స. లోకేష్ కనుసన్నల్లోనే విశాఖలో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు.
మొత్తానికి ఈ వ్యవహారం ఇలా రాజకీయ రంగు పూసుకుంటోంది. దీంతో చంద్రబాబు కాస్త సీరియస్ గానే ఈ ఇష్యూపై దృష్టి సారించారట! జిల్లా కలెక్టర్ కు క్లాస్ తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. 233 గ్రామాల్లో దాదాపు లక్షకుపైగా ఎకరాలకు సంబంధించిన ఎఫ్.ఎమ్.బి. కాపీలు కనిపించకుండా పోయాయని ఎందుకు ప్రకటించారంటూ చంద్రబాబు ఆగ్రహించినట్టు తెలుస్తోంది. ఈ దందాతో సంబంధం ఉన్న తెలుగుదేశం నేతలు ఎవరైనా ఉన్నారా..? ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటూ సీఎం ఆరా తీశారట. విశాఖ భూదందాపై రాజకీయంగా జరుగుతున్న రచ్చకు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన ఫిక్స్ అయ్యారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
నిజానికి, ఈ వ్యవహారంపై సిట్ వేసినట్టు ఈ మధ్యనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అది ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదనీ, కంటితుడుపు చర్య మాత్రమే అని విపక్షం విమర్శిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారానికి చంద్రబాబు ఎలాంటి ముగింపు ఇస్తారో వేచి చూడాలి.