మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలంటే.. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కావాల్సిందేనంటూ.. మెలిక పెట్టారు.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. పదో తేదీన కేబినెట్ భేటీ ఏర్పాటు చేయాలంటూ.. సీఎంవో నుంచి వచ్చిన లేఖపై ఆయన… అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు. ఎజెండాలో అంశాలపై సీఈసీ అనుమతి ఇస్తేనే కేబినెట్ సమావేశం జరుగుతుందని.. ఆయన అంటున్నారు. అసాధాణ పరిస్థితులు ఉంటేనే కేబినెట్ నిర్వహణకు కోడ్ అనుమతి ఇస్తుందంటున్నారు. ఏయే అంశాలు అజెండాలో పెట్టాలనేది సీఎం కార్యాలయం సమాచారం ఇచ్చిన తర్వాత … అజెండాపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటామన్నారు. శాఖలు ఇచ్చిన సమాచారాన్ని సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలిస్తోందని… ఆ తర్వాత ఈసీకి పంపుతామంటున్నారు. కేబినెట్ భేటీ పెట్టాలంటే.. ఈసీకి 48 గంటల ముందు సమాచారం ఇవ్వాలని సుబ్రహ్మణ్యం అంటున్నారు.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున… ఆ కోడ్‌కు ఇబ్బంది లేని అంశాలనే అజెండాలో పెట్టాలి.ఖరీఫ్ ప్రణాళిక, కరువు, తుఫాను సాయం, వడదెబ్బ తదితర అంశాలపై చర్చకు కోడ్ వర్తించదు. ఈ అంశాలను మంత్రివర్గ అజెండాలో చేర్చాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయించారు. అదే విషయాన్ని నోట్లో సీఎ్‌సకు కూడా పంపినట్లు తెలిసింది. ముందే పంపడం వల్ల ఆయా అంశాలపై స్టేటస్ నోట్ సిద్ధం చేయడానికి వీలవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా .. నాలుగుసార్లు క్యాబినెట్ సమావేశాన్ని మోదీ ఏర్పాటు చేశారని, అటువంటప్పుడు తాను క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఎలా ఉంటుందని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు.. కేబినెట్ భేటీ అంశంపై.. ఏపీ సీఈవో ద్వివేదీతోనూ… ఎల్వీ సుబ్రహ్మణ్యం చర్చలు జరుపుతున్నారు.
నిజానికి.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా… కేబినెట్ భేటీ నిర్వహించకూడదని ఎక్కడా లేదు. అయితే.. ఇంత వరకూ అలాంటి భేటీ జరపాల్సిన పరిస్థితులు రాలేదు. కానీ మోడీ కేబినెట్ భేటీ నిర్వహించడం… ఏపీలో సీఎస్ ప్రజాప్రభుత్వానికి అధికారాలు లేవనడంతో… పరిస్థితులు తీవ్రంగా మారాయి. అధికారాలు ఎంత ఉంటాయో చూపించాలని మాత్రమే కాకుండా.. బిజినెస్ రూల్స్ అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు కేబినెట్ భేటీ నిర్వహించాలనుకుంటున్నారు. ఈ సమావేశానికి అధికారులు రావాల్సి ఉంటుందని, ఒకవేళ ఎవరైనా గైర్హాజరైతే , సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా వారిని సరిదిద్దాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులకు ఢిల్లీలోని ఈసీనే కారణమని చెబుతున్నారు కాబట్టి.. ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.