ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కందుకూరు సభలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కూడా వాగ్బాణాలు సంధించడం లో ఈమధ్య మోడీని ఫాలో అవుతున్నారా అనిపిస్తోంది. నిన్న కందుకూరు సభలో ఆయన వ్యాఖ్యలు చేస్తూ బిజెపి పార్టీ సమర్థించే వారందరూ రాష్ట్ర ద్రోహులు అంటూ వ్యాఖ్యలు చేశారు.
నిన్న కందుకూరు సభలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘నవ్యాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్రప్రభుత్వంపై నేను ధర్మపోరాటం చేస్తుంటే.. కొంతమంది కేంద్రానికి సహకరిస్తూ నాపై దాడి చేస్తున్నారు. అలాంటివారంతా రాష్ట్ర ద్రోహులే. గతంలో బ్రిటిష్ పాలకులు స్థానికంగా కొంతమందిని లోబరచుకుని.. దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న విధంగా ప్రస్తుత కేంద్రం కూడా రాష్ట్రంలో కొందరిని లోబరచుకుని టీడీపీపైనా, రాష్ట్రంపైనా దాడి చేస్తోందని’ మండిపడ్డారు.
అయితే ఈ వ్యాఖ్యలు ఉన్నవాళ్లు గతంలో మోడీ మరియు బిజెపి నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా మాట్లాడితే వెంటనే వాళ్లను దేశద్రోహులు గా, పాకిస్తాన్ ఏజెంట్ గా ముద్రవేయడం బిజెపి నాయకులకు పరిపాటి . ప్రకాష్ రాజ్ లాంటి నటులు అయితే, వాళ్లని ప్రశ్నిస్తున్నందుకు బిజెపి నాయకులు తనను పాకిస్తాన్ వెళ్లిపోవాలని అంటున్నారని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బీజేపీని సమర్థించే వాళ్ళందరూ రాష్ట్ర ద్రోహులు అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే బహుశా చంద్రబాబు కూడా మోడీ బీజేపీ తరహా వ్యూహాన్నే అమలు చేస్తున్నాడనిపిస్తోంది