తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎకరానికి రూ. నాలుగు వేల చొప్పున.. రైతులకు ఇచ్చేందుకు “రైతు బంధు” పథకం పెట్టారు. కేసీఆర్ అధికారికంగా ఓట్లు కొంటున్నారని.. చాలా మంది విమర్శలు చేశారు. కానీ.. అది తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకంలో భాగంగా మారిపోయింది. రైతు సంక్షేమం కోసం.. ఆ రూ. నాలుగు వేలు ఉపయోగపడ్డాయో లేదో కానీ.. కేసీఆర్ , టీఆర్ఎస్ సంక్షేమం కోసం బాగా ఉపయోపడ్డాయని ఎన్నికలతో తేలిపోయింది. అదేదో బాగుందని.. కొన్ని రాష్ట్రాల్లో… అమలు చేయడం ప్రారంభించారు. చివరికి కేంద్రం కూడా.. కిసాన్ సమ్మాన్ పేరుతో పథకం పెట్టింది. అన్నీ ఓట్ల కొనుగోలు పథకాలే. ఈ విషయంలో.. టీడీపీ ప్రభుత్వం..ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరింత దూకుడుగా ఉన్నారు. పక్కా లెక్కలతో.. ఈ ఓట్ల కొనుగోలు పథకాలకు రూపకల్పన చేసి.. ఎన్నికల్లోపు ప్రతీ నెలా … ఓటర్లకు నిధులు చేరేలా ఏర్పాట్లు చేశారు.
రెండు కోట్ల ఓటర్లకు నగదు లబ్ది..!
ఆంధ్రప్రదేశ్లో మూడున్నర కోట్ల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని వర్గాల ప్రజలకూ.. ప్రభుత్వం తరపున సాయం అందేలా..చంద్రబాబు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇది కూడా.. ఇంతేనా…అని అనిపించేలా కాదు.. భలే ఇచ్చారే అనిపించేంతగా… పంపిణి చేస్తున్నారు.
1. 90 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ. 20 వేలు, సెల్ ఫోన్లు
2. 55 లక్షల మంది వృద్ధులకు పెన్షన్లు రెట్టింపు
3. 80 లక్షల మంది రైతులకు రూ. 10 వేలు
వీరందరూ కలిస్తే రెండు కోట్ల కన్నా ఎక్కువ మందే అవుతారు. కానీ.. వృద్ధాప్య పించన్లు పొందిన వారు.. అలాగే.. డ్వాక్రా సాయం పొందిన వారు… ఒకరే అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా రెండు రకాల సాయాలు పొందిన వారు.. రైతు కుటుంబాల్లో కూడా ఉన్నారు. వీరందరికి లెక్క తీసేస్తే.. కనీసం రెండు కోట్ల మంది ఓటర్లకు నేరుగా… నగదు లబ్ది చేకూరుతోంది.
ఉద్యోగులు, జర్నలిస్టులకూ తాయిలాలు..!
చంద్రబాబు..కేవలం మహిళలు, రైతులు, వృద్ధులకు మాత్రమే… పథకాలు అందించి… సైలెంటయిపోయారు. ఇతర వర్గాలకూ…ప్రయోజనాలు కల్పిస్తున్నారు. ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయిస్తూ.. కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఐఆర్ కూడా పెంచుతూ.. నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాల పట్ల ఉద్యోగుల్లోనూ సానుకూలత పెరిగింది. జర్నలిస్టులకూ.. ఆ తరహా అందిస్తున్నారు. వారి హౌసింగ్ సొసైటికి భూమి కేటాయించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి… కొన్నేళ్లుగా.. జర్నలిస్టులకు.. ఉద్యోగ సంఘాలకు.. ఎలాంటి ఇళ్ల సౌకర్యం కల్పించలేదు. ఇప్పుడు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంతో… వారిలోనూ ఓ సానుకూలత ఏర్పడింది.
సాయం పొందిన వారంతా ఓట్లేస్తారా..?
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన వారంతా.. ఓట్లేస్తారా ఏమిటి..అన్న ధైర్యం విపక్షాలకు ఉండొచ్చు.. అలాగే ఆ భయం.. అధికారపక్షానికి కూడా ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు ఓటర్లను చదివారు కాబట్టి… పోస్ట్ డేటెడ్ చెక్కులను పంపిణీ చేస్తున్నారు. ఈ నెల డ్వాక్రా మహిళలకు తొలి విడత సాయం అందింది. ఆ తర్వాత నెల.. ఆ తర్వాత నెల.. మరో రెండు విడతలు అందుతున్నాయి. అంటే..మార్చి , ఏప్రిల్ లో… అందుతాయి. ఏప్రిల్లోనే ఎన్నికలు జరుగుతాయి. రైతులకూ అంతే. .. ఇలా ప్రభుత్వ సాయం.. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ.. ఓటింగ్ కు వెళ్లే వరకూ అందుతూనే ఉంటుంది. కాబట్టి.. ఓటు వేయకపోవడానికి వారేకమీ కారణం కనబడకపోవచ్చనేది… టీడీపీ వర్గాల అంచనా.
మొత్తానికి చంద్రబాబు… సంపద సృష్టించి…ప్రజలకు పంచుతున్నానని.. మరోసారి చాన్సిస్తే.. అంత కంటే ఎక్కువే పంచుతాననే సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు. ఇది వర్కవుట్ అవుతుందా.. రెండు కోట్ల ఓట్లు వస్తాయా.. అన్నది.. కౌంటింగ్ తర్వాతే తేలుతుంది.