హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలో రేగిన ఇసుక వివాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యంచేసుకోవలసివచ్చింది. ఇసుక అక్రమరవాణాను అడ్డుకోటానికి వెళ్ళిన ముసునూరు తాసీల్దారు వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వర్గీయులు దాడి చేయటంతో రెవెన్యూ ఉద్యోగులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. జపాన్ పర్యటననుంచి ఢిల్లీ చేరుకున్న సీఎమ్, వనజాక్షికి గురువారంరాత్రి ఫోన్ చేసి అనునయించారు. న్యాయం చేకూర్చుతానని వనజాక్షికి హామీ ఇచ్చారు. వివాదాన్ని పరిష్కరించాలని ఆయన కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమా, వనజాక్షికి బంధువైన వల్లభనేని వంశీలను పురమాయించారు. వారు విజయవాడలో రెవెన్యూ, ఏపీఎన్జీవో సంఘాల నాయకులతో మాట్లాడారు. అయితే, తనపై దాడికి ఉసిగొల్పిన ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్ట్ చేయాల్సిందేనని వనజాక్షి పట్టుబడుతున్నారు. క్షమాపణ చెప్పిస్తే సరిపోదని అంటున్నారు. మరోవైపు చింతమనేనిని అరెస్ట్ చేసేవరకు తమ పోరాటం ఆగదని, సమ్మె విరమించబోమని రెవెన్యూ ఉద్యోగసంఘాల నాయకులు ప్రకటించారు. సోమవారం ముఖ్యమంత్రి సమక్షంలో చర్చలు జరపటానికి అంగీకరించారు. ఇటు చింతమనేని తన తప్పేమీలేదని చెప్పుకొచ్చారు. రెవెన్యూ ఉద్యోగులకు, డ్వాక్రా మహిళలకు మధ్య గొడవ జరుగుతుంటే తాను ఆపబోయానని, కిందపడిన వనజాక్షిని తాను లేవదీశానని చెప్పారు. వనజాక్షి కంటతడి పెట్టటం తనను కలచివేసిందని అన్నారు. తనది బకరా బతుకైపోయిందని చెప్పారు. చింతమనేనిది మొదటినుంచి వివాదాస్పద వ్యవహారశైలే. గతంలో కాంగ్రెస్ హయాంలో దెందులూరులో జరిగిన ఓ కార్యక్రమంలో నాటి మంత్రి వట్టి వసంతకుమార్తోనే కలబడటంతో పోలీసులు నాడు అరెస్ట్ చేశారు.