రాజమండ్రి సభలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విభజన చట్టంలోని అంశాల్లో దాదాపు అన్నీ అమలు చేశామనీ, ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పదేళ్లు సమయం ఉన్నా కూడా… కేవలం ఐదేళ్లలోనే ఆంధ్రాకి మోడీ సర్కారు అంతా చేసేసిందని అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి నిధులు తీసుకుని, పెద్ద ఎత్తున అవినీతికి చంద్రబాబు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. అంతేకాదు, పాక్ ప్రధాని వ్యాఖ్యలకు మద్దతుగా సీఎం మాట్లాడుతున్నారనీ, ఈ దేశ ప్రధానిపై ఆయనకు నమ్మకం లేదనీ అమిత్ షా అన్నారు. శుక్రవారం ఉదయం పార్టీ నేతలతో జరిగిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ అంశంపై ముఖ్యమంత్రి స్పందించారు.
రెచ్చగొట్టే విధంగా అమిత్ షా మాట్లాతుండటం సరైన పద్ధతి కాదన్నా సీఎం. ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారనీ, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆయన ప్రకటనలు ఉండటం బాధ్యతా రాహిత్యమన్నారు. విభజన చట్టంలో అన్ని అంశాలనూ అమలు చేశామని చెబుతున్నారనీ, తాము ఎప్పట్నుంచో అడుగుతున్న 18 అంశాలపై అమిత్ షా ఎందుకు మాట్లాడటం లేదనీ, అవి విభజన చట్టంలో లేవా అంటూ ప్రశ్నించారు. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై అమిత్ షాని ఎక్కడికక్కడ నిలదీయాలంటూ పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రాకి కేంద్రం నుంచి రావాల్సిన రూ. లక్ష కోట్లు వచ్చి ఉంటే… మన పరిస్థితి మరోలా ఉండేదనీ, కానీ కుట్రలూ కుతంత్రాలు చేయడంతోనే మోడీ, అమిత్ షాలు నిమగ్నమై ఉన్నారంటూ విమర్శించారు. జాతీయ స్థాయి మన రాష్ట్ర ప్రయోజనాలకు ఎవరు మద్దతు ఇస్తారో వారితోనే స్నేహం ఉంటుందని అన్నారు.
వాస్తవానికి, పాక్ ప్రధానిపై చంద్రబాబుకు నమ్మకమా అంటూ అమిత్ షా చేసినవి కచ్చితంగా వివాదాస్పద వ్యాఖ్యలే. ఆ వ్యాఖ్యల ద్వారా టీడీపీ నేతలను రెచ్చగొట్టి, విమర్శలు చేయించాలని భావించినట్టున్నారు. అదే జరిగితే… ఆంధ్రాకి కేంద్ర సాయం అనే అంశం కాస్త పక్కకి వెళ్తుంది కదా! టీడీపీ వెర్సెస్ భాజపా నేతల మధ్య దేశభక్తి అంశం తీసుకొచ్చేందుకు అమిత్ షా ప్రయత్నించారని అనుకోవచ్చు. అయితే, ఆ అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా… ఏపీకి కేంద్రం ఇవ్వాల్సిన నిధుల గురించి, పెండింగ్ ఉన్న సమస్యల గురించి మాత్రమే ప్రశ్నించాలంటూ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. మరి, ఇప్పుడు అమిత్ షా మరోసారి అదే అంశాన్ని తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తారా, లేదంటే ఆంధ్రాకి అన్నీ ఇచ్చేశామనే పాత ధోరణినే కొనసాగిస్తారా చూడాలి.