ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకోవడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి బాగా అలవాటు. ఆ మధ్య ఇలానే ఓ సర్వే చేయించుకున్నారు. తెలుగుదేశం పాలనపై ఏపీ ప్రజలు ఏమేరకు సంతృప్తిగా ఉన్నారో తెలుసుకోవడమే సర్వే పరమార్థం. అయితే, ఆ సర్వే ప్రకారం ఏపీ ప్రజల్లో 80 శాతం మంది టీడీపీ సర్కారుపై సంతృప్తిగా ఉన్నారని ఘనంగా వెల్లడించారు. అంతేకాదు, ఆ 20 శాతం కూడా సంతృప్తిని సాధించాలంటూ నాయకులకు టార్గెట్స్ ఫిక్స్ చేశారు! నూటికి నూరు శాతం సంతృప్తి సాధన దిశగా కృషి చేస్తున్నామని గతంలో చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే… చంద్రబాబు ఎంతో ఘనంగా చెప్పుకున్న ఈ సర్వే లెక్కలు రివర్స్ అయిన సందర్భం చోటు చేసుకుంది!
పశ్చిమ గోదావరి జిల్లా పోతవరం వద్ద ఓ సభ జరిగింది. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామనీ, ఎన్నో పథకాల ద్వారా లబ్ధి చేకూర్చుతున్నారనీ ఆయన అన్నారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా… ఎంతమంది ఉన్నారంటూ చేతులు ఎత్తమని కోరారు. అయితే, ప్రజల నుంచి వచ్చిన సమాధానంతో చంద్రబాబు ఖంగు తినాల్సి వచ్చింది. టీడీపీ పాలనపై తాము సంతృప్తిగా లేమని ప్రజలు చెప్పారు. ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారని మళ్లీ అడిగితే.. సభలో పాల్గొన్న దాదాపు 70 మంది చేతులు ఎత్తారట. దీంతో చంద్రబాబు షాక్ తిన్నారని కథనం.
ఇంతకీ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటని మళ్లీ ప్రశ్నిస్తే… ప్రతీ చిన్న పనికీ వీఆర్వోలు లంచాలు అడుగుతున్నారని కొందరు, రెండేళ్లుగా పెన్షన్లు అందడం లేదని మరికొందరూ ఇలా రకరకాల సమస్యలతో ప్రజలు వాపోయారు. దీంతో టీడీపీ నేతలందరూ కామ్ గా ఉండిపోయారట. ప్రజలను శాంతపరచే ప్రయత్నంలో పడ్డారట. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు సంతృప్తిగా ఉన్నారంటూ ఓ పక్క ఘనంగా ప్రచారం చేసుకుంటూ ఉంటే… ఇక్కడ 70 శాతం ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషమే.
అంటే, 80 శాతం సంతృప్తి అంటూ గతంలో చేయించిన లెక్కలు కరెక్టేనా..? లేదంటే, ఆ సర్వే సమయంలో ఈ గ్రామాన్ని వదిలేశారా..? లేదంటే, 20 శాతం అసంతృప్తి ఉందని గత సర్వేలోనే తేలింది కదా. దాని ప్రకారం ఆ 20 శాతంలో ఉన్న ప్రజలేనా వీరంతా..? ఇంతకీ, చంద్రబాబు పాలనపై ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు..? ఇలాంటి గ్రామాలు ఇంకెన్ని ఉన్నాయి..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయినా, బహిరంగ సభల్లో ఇలాంటి ప్రశ్నలు అవసరమా చెప్పండీ..? ఇలాంటి నెగెటివ్ సమాధానాలు వస్తే… సర్దిచెప్పుకోవడానికి కొత్తకొత్త విశ్లేషణలు చేయాల్సి వస్తుంది కదా!