విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి షాక్ ఇవ్వాలని కూటమి గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఉప ఎన్నిక వైసీపీకి ఎంత ప్రతిష్టాత్మకమో జగన్ రెడ్డికి బాగా తెలుసు. ఈ ఎమ్మెల్సీ స్థానం టీడీపీ కైవసం చేసుకుంటే వైసీపీ మరింత బలహీనపడుతుంది. సీనియర్ నేతలు పార్టీని వీడుతారు. అందుకే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.
విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిపై పార్టీ నేతలతో శుక్రవారం చంద్రబాబు చర్చించారు. కూటమి అభ్యర్థిని గెలిపించే బాధ్యత తాము తీసుకుంటామని ఉత్తరాంధ్ర నేతలు చెప్పినా..పరిస్థితుల అధ్యయనం కోసం ఆరుగురితో చంద్రబాబు కమిటీ వేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూటమి వైపు మొగ్గు చూపేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పినా..క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదించాలని వారికి చంద్రబాబు సూచించారు.
పరిస్థితులను అధ్యయనం చేయకుండా బరిలోకి దిగితే వైసీపీకి అస్త్రం అందించడమే అవుతుంది. అందుకే మొదట పరిస్థితులను పరిశీలించి, విశ్లేషించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. దీంతో ఆ పార్టీని ఓడించేందుకు వ్యూహాత్మకంగా సాగాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పకడ్బందీ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.