ప్రజల ఆత్మ గౌరవం దెబ్బతింటే వచ్చే విప్లవాన్ని ఆపడం ప్రభుత్వాలకు సాధ్యం కాదు. అవి ఏ ప్రభుత్వాలు అయినా సరే. ఈ నిజాన్ని ఇటీవలే మన రెండు పొరుగు దేశాల ప్రజలు చూపించారు. ఇలాంటి పరిస్థితి మన దగ్గర రాకుండా చూసుకోవాల్సింది పాలకులే. ప్రజాస్వామ్య దేశాల్లో పాలకులు నియంతృత్వ భావనలు కనిపించకుండా చేసుకుని అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఎంత ఉందో ఇలాంటి ఘటనలు నిరూపిస్తాయి. బలం ఉంది కదా అని. .అణిచివేతకు పాల్పడి తాము అనుకున్నదే చేస్తామని అనుకుంటే.. ప్రజల్లో నుంచే నాయకులు పుట్టుకు వస్తారు. భారత్ కు అలాంటి ప్రమాదాలు పొంచి లేవని గట్టి నమ్మకం పెట్టుకుందాం.. కానీ ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తే మాత్రం .. చెప్పడం కష్టం. మన దేశంలో కొంత కాలంగా తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామని భావన దక్షిణాది ప్రజల్లో పెరుగుతోంది. దాన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం మాత్రం బలంగాకనిపిస్తోంది. అయితే దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటం వల్ల.. జాతీయ పార్టీల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వల్ల బలమైన నాయకత్వం ఢిల్లీలో కనిపించడం లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలబెట్టిన ఘనత దక్కించుకున్న చంద్రబాబు దక్షిణాది తరపున టాల్ లీడర్ గా ఉన్నారు. ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండవచ్చు కానీ.. ఇప్పుడు కేంద్రంలో ఆయన పవర్ ఫుల్ లీడర్. అందుకే దక్షిణాదికి ఆయన ఓ ఆయుధంగా కనిపిస్తున్నారు. అది ఆయనకు బాధ్యతగా కూడా మారుతోంది.
దక్షిణాది హక్కుల కోసం చంద్రబాబు దృష్టి
చంద్రబాబునాయుడు ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో ఓ సారి ఢిల్లీ వెళ్లినప్పుడు ఎయిర్ పోర్టులో తమిళనాడు సీఎం స్టాలిన్ కనిపించారు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత స్టాలిన్ .. దక్షిణాది ప్రయోజనాలు కాపాడాలని.. కేంద్రంతో రాజీ పడవద్దని కోరానని చెప్పారు. స్టాలిన్ ఇలా చెప్పడానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి . అది జనాభా ప్రతిపాదికన సీట్ల డీలిమిటేషన్ చేయనుండటం.. ఆదాయ పంపిణీని కూడా నిర్దేశించడం. ఇలా చేయడం వల్ల దక్షిణాది తీవ్రంగా నష్టపోతుంది. ఎంత నష్టం జరిగిందన్న భావన వచ్చినా ప్రజల్లో తిరుగుబాటు తీవ్రంగా ఉంటుంది. అందుకే అత్యంత సున్నితంగా డీల్ చేయాల్సిన విషయంలో చంద్రబాబుునాయుడు కూడా కొత్తగా పరిశీలన ప్రారంభించారు. గురువారం అమరావతిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పొలిట్ బ్యూరో సమావేశంలో దక్షిణాది ప్రయోజనాలపై ప్రత్యేకంగా ప్రస్తావించారు. జనాబా ప్రాతిపదికగా జరుగుతున్న పంపకాల్లో దక్షిణాదికి అన్యాయం జరకగకుండా పోరాడాల్సిన అవసరం ఉందని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. చంద్రబాబు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. లేకపోతే పొలిట్ బ్యూరోలో ఈ అంశంపై చర్చించేవారు కాదు. దక్షిణాది ప్రయోజనాల కోసం చంద్రబాబునాడు గత పదేళ్లుగా గళమెత్తుతూనే ఉన్నారు. మొదటి సారి ఎన్డీఏ ప్రభుత్వాలు రెండు చోట్ల ఏర్పడినప్పుడు కూడా ఆయన మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన ఆదాయం పంపకం లేదా.. సీట్ల విభజన జరిగితే.. ప్రజలో వచ్చే ఆగ్రహాన్ని తట్టుకోలేమని అన్నిరాజకీయ పార్టీలకు తెలుసు. అందుకే బలంగా తమ వాదన వినిపిస్తున్నారు.
Read Also : విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం… జేపీసీకి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు
జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి శిక్ష
భారత్ లో జనాభా నియంత్రణ పాటించాలని గతంలో కేంద్రం ప్రత్యేక పథకాలు పెట్టింది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు చైతన్యవంతులయి జనాభాను నియంత్రించారు. కానీ ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు మాత్రం ఈ విషయంలో విపలమయ్యారు. ఫలితంగా ఉత్తరాదిన జనాబా విపరీతంగా పెరిగింది. దక్షిణాదిన ఆ స్థాయిలో పెరగలేదు. ఫలితంగా జనాభా సాంద్రత దక్షిణాదిలో తగ్గింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్ల విభజన జరిగితే దేశంలో తన ప్రాధాన్యాన్ని దక్షిణాది మరింత ఎక్కువగా కోల్పోతుంది. ఉత్తరాది ఆధిపత్యమే ఉంటుంది. 1976లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 2021 జనగణన వరకు లోక్‌సభ స్థానాలను పెంచకుండా ప్రత్యేకమైన చట్టం చేశారు. 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చేసి 2026 తరువాత జరిగే తొలి జనాభా లెక్కల ప్రకారం స్థానాల సంఖ్య పెంచాలని చట్టంలో మార్పులు చేసింది. ఇదే అసలు పెద్ద సమస్యగా మారింది. 2026 తర్వాత పార్లమెంట్ నియోజకర్గాల పునర్విభజన జరగనుంది. ప్రస్తుత ఎంపీ స్థానాలకు 1971 నాటి జనగణన ప్రాతిపదిక. ఆ లెక్క ప్రకారం తెలంగాణకు 17, ఆంధ్రప్రదేశ్‌కు 25 లోక్‌సభ స్థానాలున్నాయి. 2026 నాటికి ఈ రెండు రాష్ట్రాలలో జనాభా పెరుగుదల నిష్ఫత్తి ఇప్పుడున్నదానికన్నా భారీగా తగ్గిపోయింది. దీంతో రెండు రాష్ట్రా లు కలిసి కనీసం ఏడెనిమిది స్థానాలు కోల్పోతాయని నిపుణులు అంచనా వేశారు. మొత్తం దక్షిణాదికీ ఇదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా పునర్విభజనలో వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉంది. ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 174 కాగా పునర్విభజనతో వీటి సంఖ్య ఏకంగా 204 స్థానాలకు చేరుకుంటుందని అంచనా వేశారు. పార్లమెంట్ సీట్లు కూడా పెంచాలనుకుంటున్నారు. అలా అయినా సీట్లు పెరిగే నిష్ఫత్తి చూస్తే దక్షిణాదికి ఘోరమైన అన్యాయం జరుగుతుంది. అసలు లెక్కలోకి కూడా రాదు. అప్పుడు కేంద్రం చూపే వివక్ష మరింత ఎక్కువగా ఉంటుంది.
వివక్షపై దక్షిణాదిలో పెరుగుతున్న స్వరాలు
ఇప్పటికే దక్షిణాదిలో తమ ఆదాయాన్ని ఉత్తరాదికి పెడుతున్నారన్న ఆగ్రహం కనిపిస్తోంది. కేంద్రం జీఎస్టీ, పెట్రో ట్యాక్స్ లు సహా పలు పన్నులు వసూలు చేస్తుంది. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వాటా ఖరారు చేసే విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతున్నాయి. కర్ణాటక నుంచి కేంద్రానికి వెళ్లి ప్రతి రూపాయి పన్నుల్లో కేవలం 15 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయి. తమిళనాడుకు 28 పైసలు, ఏపీకి 42 పైసలు, తెలంగాణకు 47 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయి. కానీ విచిత్రంగా మరికొన్ని రాష్ట్రాలకు మాత్రం భారీ కేటాయింపులు ఉన్నాయి. ఇందులో టాప్ ప్లేస్‌లో ఉన్నవి ఈశాన్య రాష్ట్రాలు. అక్కడి భౌగోళిక పరిస్థితులు, సరిహద్దు సమస్యల దృష్ట్యా ఈ కేటాయింపులు చేస్తున్నారు. రాజస్థాన్‌కు సేకరించే ప్రతి రూపాయికి.. ఒక రూపాయి 20 పైసలు కేటాయిస్తుంది. ఒడిశాకు ఒక రూపాయి 25 పైసలు. మధ్యప్రదేశ్‌కు అయితే తీసుకునే ప్రతి రూపాయికి బదులుగా రెండు రూపాయల 9 పైసలు, యూపీ నుంచి కేంద్రానికి రూపాయి వస్తే రెండున్నర రూపాయలు కేటాయిస్తోంది. అయితే ఈ లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న రాష్ట్రం బీహార్. ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వసూలు చేసే ప్రతి రూపాయికి ఏకంగా 7 రూపాయల 26 పైసలు కేటాయిస్తుంది కేంద్రం. కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేది దక్షిణాది రాష్ట్రాలు. కానీ ఇప్పుడా నిధులను ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి ఉపయోగిస్తున్నారనేది ఆరోపణ. ఇదే విషయాన్ని ఫైనాన్స్ కమిషన్ ముందు ఉంచాయి దక్షిణాది రాష్ట్రాలు. దీంతో జనాభా నియంత్రణ చేసినందుకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అమల్లోకి రావడం లేదు.
దేశ పరిపాలనలో దక్షిణాదికి అత్యంత తక్కువ ప్రాధాన్యం
లోక్ సభ సీట్లు, ఆదాయం మాత్రమే కాదు.. గత కొంత కాలంగా.. దేశ పరిపాలనలో దక్షిణాది పాత్ర చాలా పరిమితంగా ఉంటోంది. కేంద్రంలో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్, కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన శాఖలు .. ఇలా దేశాన్ని పాలించే దేన్ని తీసుకున్నా దక్షిణాది వాసుల ప్రాధన్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు దక్షిణాదిపై నిర్లక్ష్యం చూపిస్తున్నారన్నది ప్రశ్న. ఈ భావన ప్రజల్లో అంతకంతకూ పెరిగిపోతోంది. ఇప్పుడు దేశం అత్యంత కీలకమైన అడుగులో ఉంది. అవార్డులు ఇవ్వటంలో సైతం కేంద్రం దక్షిణాదిపై వివక్ష చూపుతోంది. పద్మా అవార్డులు చాలా తక్కువగా దక్షిణాదికి చెందినవారికి దక్కుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే అత్యధిక ఆదాయం ఆర్జిస్తుంటే, రైల్వే బడ్జెట్లో అధికమొత్తం ఉత్తరాదికి ఇస్తూ దక్షిణాది రాష్ట్రాలకు తూతూ మంత్రంగా విదిలిస్తున్నారు. ఒక ప్రాంతానికి దీర్ఘకాలంపాటు అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో వేర్పాటు వాదనలు ఏర్పడతాయి. సినీనటుడు కమలహాసన్, డిఎంకె నాయకుడు స్టాలిన్, ద్రవిడనాడు ఏర్పాటుపై దక్షిణాది రాష్ట్రాలు కలిసివస్తే తాను స్వాగతిస్తానని అన్నారు. పవన్ కల్యాణ్ సైతం యునైటెడ్ స్టేట్స్ఆఫ్ సదరన్ ఇండియా ఆలోచనకు మద్దతు పలికారు. తర్వాత వెనక్కి తగ్గారు.
అందరికీ న్యాయం చేస్తేనే దేశం బలోపేతం
అయితే ఇప్పుడు దేశాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం మోదీ సర్కార్‌కు వచ్చింది. అది కూడా చంద్రబాబు తన చేతుల మీదుగా చేసే అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. దేశంలో దక్షిణాది ప్రాధాన్యాన్ని గుర్తించి నిధులు, విధులు , పదవుల విషయంలో సంతృప్తి చెందేలా చేయగలిగితే.. దేశం మరింత బలపడుతుంది. ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఆ బాధ్యత ఉందని అనుకోవచ్చు. పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించడం ద్వారా చంద్రబాబు తన బాధ్యతను.. తన ప్రాధాన్యాన్ని గుర్తించి.. కార్యాచరణ ప్రారంభించారని అనుకోవచ్చు. మిగతా ఏం జరుగుతుందో.. వేచి చూడాల్సిందే !