నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడం అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం. అందుకే, నిర్మాణాల విషయంలో ఎక్కడా రాజీపడకుండా విదేశీ కంపెనీలతోనే డీల్ చేస్తున్నారు. డిజైన్లు కూడా అక్కడి నుంచే రప్పించారు! అంతేకాదు, చైనా, జపాన్, సింగపూర్ ఎన్నో విదేశాలకు చెందిన ప్రముఖ కంపెనీలు అమరావతి నిర్మాణం కోసం పోటీ పడుతున్నాయంటూ ఈ మధ్య చెబుతూ వచ్చారు. అయితే, ఇప్పుడు ఆ మాట కాస్తా మారిపోయింది. కారణం ఏంటంటే… ప్రభుత్వం టెండర్లను పిలుస్తున్నా చంద్రబాబు ఆశించిన అంతర్జాతీయ స్థాయి కంపెనీలు ముందుకు రావడం లేదు. అలాంటప్పుడు, ఏం చెయ్యాలి..? వాళ్లు రాకపోతే మనమే వెళ్దాం అనే రీతిలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు! విదేశీ కంపెనీలకు భారీ ఆఫర్లు ఇచ్చేందుకు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది.
నవ్యాంధ్ర నిర్మాణం కోసం స్వచ్ఛందంగా రైతులు ఇచ్చిన భూములకు చంద్రబాబు సర్కారు ఓ నామ మాత్రపు ధరను నిర్ణయించి, వారికి నచ్చిన కంపెనీలకు ఇవ్వబోతున్నారన్నమాట! ఆంధ్రాలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్స్, స్టార్స్ హోటల్స్ నిర్మాణం కోసం ఇదే పద్ధతిని అనుసరించాలని చంద్రబాబు తాజాగా ఆదేశించారట! అంటే, బిడ్డింగులు ద్వారా కంపెనీలను ఆహ్వానించరు! ప్రపంచంలోనే ఓ టాప్ 15 కంపెనీలను ఎంపిక చేసి, వారితో సంప్రదింపులు జరిపి, వారిని అమరావతికి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఇంతకీ, ఈ టాప్ 15 కంపెనీలను ఏ ప్రాతిపదిక ఎంపిక చేస్తారూ..? వాటికి ఆ ర్యాంకింగ్స్ ఎవరు ఇస్తారూ..? వాటి పనితీరును ఇక్కడ ఆంధ్రాలో కూర్చుని అంచనా వేయడం సాధ్యమా..? ఆ కంపెనీలు చంద్రబాబుకు నచ్చితే సరిపోతాయా.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఈ క్రమంలో ఉంటాయి.
చూస్తుంటే ఈ నయా విధానం కూడా స్విస్ ఛాలెంజ్ తరహాలోనే భారీ ఎత్తున విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే, ఒక ధరను నిర్ణయించి టెండర్లు పిలిచిన తరువాత, దానికి సరైన స్పందన రాకపోతే.. ఆ ధరను మార్చడం అనేది సంప్రదాయం. ధరలను కాస్త తగ్గించి, దాంతోపాటు ఇతర సదుపాయాలను పెంచి మరోసారి టెండర్లు పిలవాలి. కానీ, దీనికి విరుద్ధంగా ఓ పదిహేను కంపెనీలను మనమే ఎంచుకుని, వాళ్ల దగ్గరకు మనమే ఆఫర్లతో వెళ్లి, రైతుల భూముల్ని వాళ్లకు కట్టబెట్టి అమరావతిని కట్టించాలని అనుకోవడమేంటో..? ముఖ్యమంత్రికి నచ్చిన కంపెనీలను పిలిచేసి పనులు ఇచ్చేస్తారన్నమాట! ఈ విధానంలో కంపెనీలను ఫైనలైజ్ చేసేందుకు ఓ కమిటీ ఉంటుందని అని చెబుతున్నా… ఆ కమిటీలో ఉన్న మంత్రులూ ఉన్నతాధికారులూ చంద్రబాబు మాటలను కాదనే సీన్ ఉండదు కదా! మొత్తానికి, ఈ విధానం కూడా లోపభూయిష్టంగా ఉందనేది విమర్శలు ఎదుర్కోవాల్సింది.