మహా పుష్కరాలలో గోదావరిలో స్నానం చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని, నేరుగా స్వర్గానికే వెళ్లిపోవచ్చని వేదపండితులు చెపుతున్నారు. ఆ కారణంగానే జనాలు తండోప తండాలుగా పుష్కర స్నానాలకి బయలుదేరి వస్తున్నారు. కానీ నిన్న జరిగిన త్రొక్కిసలాటలో కొందరు దురదృష్టవంతులు ప్రాణాలు కోల్పోగా అనేకమంది గాయపడ్డారు. పుష్కర స్నానం చేసినంత మాత్రాన్న చేసిన పాపాలన్నీ గోదాట్లో కొట్టుకు పోతాయని, పుణ్యం వచ్చేస్తుందని అనుకొంటే, ఆ లెక్కన నిన్న అందరికంటే ముందుగా పుష్కరస్నానం చేసిన చంద్రబాబు నాయుడుకే చాలా పుణ్యం వచ్చి ఉండాలి. కానీ ఆయన కారణంగా ఏకంగా 35మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినందుకు ఆయన తన పదవికి రాజీనామా చేసి కాశీకి వెళ్లి గంగలో మునిగినా ఆయన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోలేరని జగన్ తేల్చి చెప్పారు.
నిజానికి చంద్రబాబుని జైల్లో పెట్టాలని కూడా ఆయన తీర్పు చెప్పారు. కానీ ఆ కోరిక నెరవేరే అవకాశం లేదు కనుక చంద్రబాబు నాయుడు కాకుండా వేరెవరివల్లనయినా ఇదే పొరపాటు జరిగి ఉండి ఉంటే వారిని తప్పకుండా జైల్లో పెట్టేవారని జగన్ తనని సముదాయించుకొన్నారు. జగన్ శాపనార్ధాలు మాటెలా ఉన్నా పుష్కరాలలో చనిపోయిన వారి కుటుంబాలు చంద్రబాబుని తిట్టుకోకుండా ఉండరు. చంద్రబాబు నాయుడుని అన్ని శాపనార్ధాలు పెట్టిన తరువాత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా పుష్కర స్నానాలు చేసారు. కనుక ఆయన చేసిన పాపాలు (11 సీబీఐ కేసులు, ఈడీ కేసులు వగైరా) మాఫీ అయిపోతాయనుకోలేము. ఎందుకంటే మన కోర్టులకు చట్టాలకు ఇటువంటి సెంటిమెంట్లు లేవు కనుక.
జగన్మోహన్ రెడ్డి క్రీస్టియన్ అయినప్పటికీ చాలా సంప్రదాయబద్దంగా వేద పండితులు,పురోహితులను పెట్టుకొని గోదాట్లో పుష్కర స్నానం చేయడం ఒక విశేషం అనుకొంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం తన తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి పిండ ప్రధానం కూడా చేయడం విశేషం. అది ఆయన వ్యక్తిగత విషయం కనుక విమర్శించడానికి లేదు. కానీ రాజకీయ నాయకులు గుళ్ళు, మశీదుల చుట్టూ తిరగడం, వారితో కలిసి వచ్చీరాని ప్రార్ధనలు చేయడం అన్నీ సదరు వర్గ ప్రజలను ఆకట్టుకోవడానికేననే ఫార్ములాని బట్టి చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి కూడా హిందువులని ఆకట్టుకోవడానికే ఈ పుష్కరకర్మలన్నీ చేసారనుకోవలసి ఉంటుంది.
కానీ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డితో సహా పుష్కర స్నానాలు చేస్తున్న రాజకీయ నేతలందరూ తమ పాపాలను వదిలించుకొని పుణ్యం మూటలు కట్టుకోగలరా? అంటే సాధ్యం కాదనే ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. పోనీ కనీసం వారి మనసులలో కల్మషాన్నయినా వారు గోదాట్లో కడుక్కోగలిగారా?అంటే అదీ లేదనే చెప్పవచ్చును. ఎందుకంటే పుష్కర స్నానాలు చేసి వచ్చిన తరువాత కూడా వారు యధాప్రకారం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొంటున్నారు. మరి వేదపండితుల మాట నిజమనుకోవాలా? లేకపోతే మన రాజకీయ నాయకులు ఏ గంగలో మునిగినా మారరు…వారిని ఏ మతానికి చెందిన దేవుడూ కూడా మార్చలేడని కనుక వారికీ పాపపుణ్యాల నియమాలేవీ వర్తించవని సర్ది చెప్పుకోక తప్పదు.