చంద్రబాబునాయుడు, లోకేష్ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. ఓ లాయర్ చేసిన ఫిర్యాదు మేరకు.. కృష్ణా జిల్లా నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. గత వారం చంద్రబాబునాయుడు.. వర్చువల్ మహానాడు నిర్వహణ కోసం..హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చారు. ఆ సమయంలో.. ఆయనకు పలు చోట్ల కార్యకర్తలు స్వాగతం పలికారు. నేతలే ఇలా జన సమీకరణ చేసి స్వాగతం చెప్పారని… దానికి చంద్రబాబు, లోకేష్ ప్రోత్సాహం ఇచ్చారని… వారు కనిపించినప్పుడల్లా.. కాన్వాయ్ ఆపి చేతులు ఊపి… కరోనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలను వైసీపీ నేతలు చేశారు.
కొంత మంది హైకోర్టులో పిటిషన్లు వేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని హైకోర్టు పిటిషన్ దార్లకు సూచించింది. ఆ తర్వాత బి.శ్రీనివాసరావు అనే లాయర్ నందిగామ పోలీసుల్ని ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ.. ఇప్పటికే అనేక మంది విపక్ష నేతలపై కేసులు పెట్టారు. పేదలకు సాయం పంపిణీ చేసే సమయంలో… భౌతిక దూరం.. మాస్కుల నిబంధనలు పాటించలేదని కేసులు పెట్టారు.
అయితే.. అంత కంటే దారుణంగా.. ర్యాలీలు.. నిర్వహించి.. పుట్టిన రోజు.. పెళ్లి రోజు వేడుకలను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా.. వైసీపీ నేతలు చేసుకున్నప్పటికీ… పోలీసులు వారి జోలికి వెళ్లలేదు . చివరికి ఎమ్మెల్యేలపై కొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. వారు చేసిన సామూహిక లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన వీడియోను హైకోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా… లాక్ డౌన్ నిబంధనల కేసుల్లో చిక్కుకున్నారు.