జాతీయ రాజకీయాల్లో ఇదో కీలక అంశంగానే చూడాలి. సుదీర్ఘ కాలంపాటు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు తొలిసారిగా ఈరోజు సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా రాజకీయాలు చకచకా మారిపోతున్నాయనడానికి ఇదో సాక్ష్యం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా, సోనియా గాంధీతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటకుపైగా ఈ సమావేశం సాగింది. సహజంగా, ఆదివారం పూట సొంత పార్టీలకి చెందిన నేతలకు కూడా సోనియా అపాయింట్మెంట్ ఇవ్వరూ అనేది చాలామంది కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు. అలాంటిది, ఏపీ సీఎం చంద్రబాబుతో ఆమె భేటీ కావడాన్ని కీలక పరిణామంగానే ఆ పార్టీ జాతీయ నేతలు కూడా చెబుతున్నారు.
భాజపా వ్యతిరేక శక్తులను కలపడంలో ఇంతవరకూ జరిగిన కృషిని సోనియాకు చంద్రబాబు నాయుడు వివరించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో, కాంగ్రెస్ నాయకత్వంలో జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేసేందుకు కొన్ని పార్టీలు వ్యక్తం చేసిన సంసిద్ధతతోపాటు, కొన్ని పక్షాలు చెబుతున్న అభ్యంతరాలను కూడా ఆమెకు చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. వివిధ జాతీయ పార్టీల నేతలతో ఆయన వరుస సమావేశాల సందర్భంగా… కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలంటే కొన్ని షరతులకు లోబడాలనే అభిప్రాయం కొంతమంది నుంచి వ్యక్తమైనట్టు తెలుస్తోంది. కాబట్టి, ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత పట్టు విడుపు ధోరణితో ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్న అంశం ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. దీంతోపాటు, ఈ నెల 21న నిర్వహించనున్న విపక్షాల సమావేశానికి సంబంధించి కూడా సోనియా, చంద్రబాబు మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలకు రెండ్రోజులు ముందే జరిగే ఆ సమావేశంలోనే కూటమికి సంబంధించి ఒక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందనీ, ఆ అంశాలపై కూడా కొంత చర్చ జరిగినట్టుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
విపక్షాలు సమావేశం, ఆ తరువత కూటమి అజెండాకు సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఒక డ్రాఫ్ట్ తయారు చేశారనీ, అది కూడా సోనియా ముందుంచారని తెలుస్తోంది! మోడీని మరోసారి గద్దెను ఎక్కనీయకుండా, అన్ని రాజకీయ పార్టీలూ ఒకటౌతున్న సమయం దగ్గరకు వచ్చిందనే చెప్పాలి. ఇవాళ్ల సాయంత్రం అమరావతికి తిరిగి వస్తున్న చంద్రబాబు… ఎన్డీయేతర, యూపీయేతర పక్షాలతో సమావేశాలను కొనసాగిస్తారని తెలుస్తోంది.