తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం అయినా ఫటాఫట్ తీసుకోరు. కనీసం ఆలోచించి అయినా తీసుకుంటారా అంటే అదీ లేదు. చివరికి వరకు చూసి… ఎవరు ఎక్కువ ఒత్తిడి తెస్తే వారికే అవకాశం కల్పించే ఫార్ములా పాటిస్తూంటారు. ఈ పద్దతి మిస్ ఫైర్ అయిన సందర్భాలే కోకొల్లలు. అయినప్పటికీ.. ఆయన తీరు ఇప్పటికీ మారలేదని.. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో తేట తెల్లమవుతోందన్న అభిప్రాయం .. ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరును ఖరారు చేశారు. ఇరవై ఏడో తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నారని ఆ పార్టీ వర్గాలు మీడియాకు కూడా సమాచారం ఇచ్చాయి. అయితే.. అంతలో ఏం జరిగిందో కానీ.. మళ్లీ మిగతా కమిటీలు ప్రకటిస్తారు కానీ.. ఏపీ టీడీపీ అధ్యక్షుడ్ని మాత్రం ప్రకటించబోరని మరోసారి ప్రచారం ప్రారంభమయింది.
ఈ ఒక్క ప్రచారం అయితే సరే కానీ.. ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు మాత్రమే కాక మరికొంత మంది బీసీ నేతలు రేసులో ఉన్నట్లుగా ప్రచారం చేసేస్తున్నారు. ఈ రే్సులో కొత్తగా నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర పేరు ప్రచారంలోకి వచ్చింది. వచ్చింది అనడం కంటే.. అచ్చెన్నాయుడు స్థానంలో కొంత మంది తీసుకు వచ్చారని అనుకోవడం కరెక్ట్. అచ్చెన్నాయుడు దూకుడైన నేత. ప్రభుత్వంపై ఆయన పోరాడతారు. ఆయన కటౌట్ మాత్రమే కాదు.. కంటెంట్ కూడా ప్రభుత్వానికి ఇబ్బందికరమే. అందుకే ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయితే.. మరింతగా ఆయన పోరాడతారనే భావన కింది స్థాయి క్యాడర్లో ఉంది. అచ్చెన్నాయుడు కూడా.. కొత్త బాధ్యతలకు సిద్ధమయ్యారు.
అనూహ్యంగా ఇరవై ఏడో తేదీన అచ్చెన్నాయుడు పేరును ఖరారు చేయడానికి సిద్ధమైన చంద్రబాబు వివిధ సమీకరణాల పేరుతో మనసు మార్చుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ నెల 27వ తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును కూడా ప్రకటిస్తారని ప్రచారం జరిగినా అది నిజం కాదని, రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఉంటుందని కొత్తగా చెప్పడం ప్రారంభించారు. ఇలాంటి నాన్చుడు వల్లే పార్టీ నష్టపోయిందని… ఇప్పటికైనా .. ఇలా బయట చర్చోపర్చలు జరిగిన తర్వాత కాకుండా.. అంతర్గతంగా చర్చించేసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటించి.. దానికే కట్టుబడి ఉంటే బెటరన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటివి ఏళ్ల తరబడి వినిపిస్తున్నా.. టీడీపీ అధినేత తీరులో మాత్రం మార్పు లేదు.