హైదరాబాద్: ఉచితంగా లభించే మద్యం, చికెన్వంటి సౌకర్యాలకోసమే అందరూ ఇండియన్ ఆర్మీలో చేరతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమలాపురం(ఎస్సీ) ఎంపీ, తెలుగుదేశం నాయకుడు పందుల రవీంద్రబాబుపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీ వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, వాటికి తెలుగుదేశం పార్టీతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంబంధంలేదని బాబు ఇవాళ చెప్పారు. ఆ వ్యాఖ్యలకుగానూ 24గంటలలోగా సంజాయిషీ ఇవ్వాలని రవీంద్రబాబును ఆదేశించారు. జాతీయ న్యూస్ ఛానల్ టైమ్స్ నౌ లో అర్ణబ్ గోస్వామి డిబేట్లో రవీంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తూ, ఒక ఆర్మీ మేజర్ ఛానల్‌కు ఫోన్ చేసి ఎంపీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసినప్పటికీ రవీంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని సమాధానం చెప్పటం విశేషం. సోషల్ మీడియాలో ఎంపీపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.