వైయస్ వివేకానంద రెడ్డి హత్యను సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం వైకాపా నాయకులు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయనగరం సభలో సీఎం మాట్లాడుతూ… ఆయన హార్ట్ ఎటాక్ తో పోయారంటే తాను సంతాపం వ్యక్తం చేశాననీ, రెండు గంటల తరువాత చంపేశారంటే వెంటనే దోషుల్ని పట్టుకోవడం కోసం సిట్ వేశానన్నారు. దొంగలు తప్పించుకోవడం కోసం ముందుగా గుండెపోటు అన్నారనీ, ఆ తరువాత తెలుగుదేశం వాళ్లు చంపారని చెప్తున్నారని సీఎం మండిపడ్డారు. గవర్నర్ దగ్గరకి జగన్ వెళ్లి సీబీఐ దర్యాప్తు కోరారన్నారు. కానీ, కోడి కత్తి కేసుని ఎన్.ఐ.ఎ.తో దర్యాప్తు చేయిస్తే ఏం జరిగిందనీ, చివరికి మన పోలీసులు ఇచ్చిన రిపోర్టులనే నిర్దారణ చేశారన్నారు. ఫ్యాన్ ఇక్కడ, స్విచ్ హైదరాబాద్ లో, కరెంట్ ఢిల్లీలో అంటూ ఎద్దేవా చేశారు. ఈ నాటకాన్ని ప్రజలు గమనించాలన్నారు.
బద్ధవైరం ఉన్న నాయకులందరనీ తాను కలిపాననీ, విజయనగరం రాజులు – బొబ్బిలి రాజులు ఇవాళ్ల ఇద్దరూ ఒకే వేదిక మీద ఉన్నారన్నారు సీఎం. కిశోర్ చంద్రదేవ్ – శత్రుచర్ల… వాళ్లనీ కలిపానన్నారు. కర్నూలులో కేఈ కుటుంబం – ఇంకోపక్క కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం… వాళ్లిద్దరినీ కలిపామన్నారు. కడపలో ఆదినారాయణ రెడ్డి – రామసుబ్బారెడ్డిలను కలిపానన్నారు. అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి – పరిటాల సునీత కలిపోయారన్నారు. మన పని అందర్నీ కలపడమనీ, జగన్ పని అందర్నీ చంపడమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందుల రాజకీయాలకు మనకు అవసరం లేదనీ, అయితే అక్కడ కూడా ఈసారి టీడీపీ గెలుస్తుందన్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అని మరోసారి చెప్తున్నాననీ, దానికి కట్టుబడి ఉంటానన్నారు. కానీ, జగన్ వస్తున్నది ‘నా భవిష్యత్తు మీ బాధ్యత’ అని వస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఆయన జైలుకు పోకుండా ఉండాలంటే, కేసుల నుంచి తప్పించుకుని తిరగాలంటే మీరు ఓట్లెయ్యాలన్న లక్ష్యంతో జగన్ వస్తున్నారని చెప్పారు. 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి అధికారంలోకి వస్తే మనం ఏమౌతామో ఆలోచించుకోవాలన్నారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై జగన్ చేస్తున్న ఆరోపణల్ని సమర్థంగా తిప్పికొట్టారు చంద్రబాబు. హత్యా రాజకీయాలపై వైకాపా ఆధారపడుతోందనీ, ఇలాంటి సంస్కృతి ఉన్న పార్టీ అధికారంలోకి వస్తే ఏమౌతుందో అనే ఆలోచన రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా, మరోసారి జగన్ పై ఉన్న కేసుల్ని ప్రస్థావించారు. రాజకీయంగా బద్ధవ్యతిరేకులుగా ఉన్న కొన్ని కుటుంబాలను కలిపామంటూ చంద్రబాబు చెప్పడం ఆకట్టుకుందనే చెప్పాలి. విజయనగరం సభలో కొసమెరుపు ఏంటంటే… పెంటమ్మ అనే వృద్ధురాలు వేదికపైకి వచ్చి, మేలు చేసిన చంద్రబాబును మరచిపోద్దనీ, దొంగల్ని నమ్మొద్దంటూ ఆవేశంగా మాట్లాడింది. ఆమెకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదాభివందనం చేశారు.