“ఇరవై ఐదుకు.. ఇరవై ఐదుమంది ఎంపీలు రాజీనామా చేసి దీక్షకు కూర్చుంటే.. దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూద్దాం… కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దాం..” అంటూ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి చేసిన చాలెంజ్‌లు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆ రోల్‌లోకి చంద్రబాబు వచ్చారు. ప్రతిపక్ష నేత పాత్రలోకి రెండున్నరేళ్ల కిందటే వచ్చినా.. ఇప్పుడు సవాల్ చేయడం ప్రారంభించారు. అన్ని మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకహోదాపై మాట మాట్లాడటం లేదు.
పైగా ముగిసిన అధ్యాయం అని పార్లమెంట్లో కేంద్రం చెబితే.. ఒక్క మాట కూడా ఎంపీలు మాట్లాడలేదు. వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. చివరికి రైల్వే జోన్ లేదన్నా కిక్కురుమనలేదు. దీంతో చంద్రబాబు అప్పట్లో జగన్ పోషించిన సవాళ్ల పాత్రలోకి వచ్చేసారు. ప్రత్యేకహోదా కోసం ఎంపీలందరూ రాజీనామా చేసి పోరాడేందుకు రావాలని చంద్రబాబునాయుడు జగన్‌కు సవాల్ చేశారు. హోదా అంశంపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని.. అందరం కలిసి ప్రత్యేకహోదా కోసం పోరాడదామని పిలుపునిచ్చారు.
ఈ సవాలుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్ ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్రం చెబితే ప్రభుత్వం ఏం చేస్తోంది? విభజన హామీల అమలు విషయంలో సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అప్పట్లో జగన్ సవాల్‌ను ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. ఆయన కూడా పట్టించుకోకపోతే కాస్త తేడాగా ఉంటుంది.ఎందుకంటే గతంలో అలాంటి సవాళ్లు విసిరింది ఆయనే మరి !