సాధారణంగా రాజకీయ ప్రసంగాలంటే… అధ్యక్షుడు వస్తారు.. ప్రసంగించి వెళ్లిపోతారు. చంద్రబాబు అయినా.. ఇప్పటి వరకూ అదే చేశారు. కానీ ఇప్పటి ప్రచారంలో తేడా కనిపిస్తోంది. ప్రజా స్పందనను బట్టి .. భాషను మారుస్తున్నారు. టాపిక్‌ను మారుస్తున్నారు. ప్రజల్లో ఉత్సాహాన్నిచ్చే అంశాలనే హైలెట్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో స్టైల్ మార్చారు. ధాటిగా జగన్ పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న ఒక్క విమర్శకూ జగన్ కౌంటర్ ఇవ్వకపోతూండటంతో .. ఆ కోణంలో.. విమర్శల దాడి పెంచుకుంటూ పోతున్నారు. ప్రజలకు ప్రశ్నలు సంధించి ..జగన్ కు వ్యతిరేకంగా జవాబులు రాబడుతున్నారు.
జగన్ కేసీఆర్, మోదీలతో.. జగన్ సన్నిహితంగా వ్యవహరిస్తూండటం.. వారిపై ఒక్క మాట మాట్లాడకపోతున్న విషయాన్ని సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు చంద్రబాబు. ఎప్పుడూ లేని విధంగా.. మాస్ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నారు. పడికట్టు పదాలకు.. స్వస్తి చెప్పి.. సాధారణ జనం ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో.. అలాగే మాట్లాడుతున్నారు. కేసీఆర్‌ను చూస్తే జగన్ తడిపేసుకుంటాడని.. వ్యాఖ్యానించడం ఇందులో భాగమే. జగన్మోహన్ రెడ్డిని మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్‌నూ చంద్రబాబు వదిలి పెట్టడం లేదు. ఆయన ప్రభావం ఉంటుందని అనుకున్న చోట.. పవన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో.. చంద్రబాబు ఇదే విషయాన్ని సూటిగా చెప్పారు. సినిమా నటుడు మనకు అవసరమా.. అని ప్రశ్నించారు. ఆయనను సినిమాలు చేసుకోనివ్వాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబు తన మానాన తాను.. ప్రసంగించి వెళ్లిపోవడం లేదు. ప్రజల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. వారి దగ్గర్నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చేలా ఉత్సాహం చూపిస్తున్నారు. సైకిల్ జోలికి వస్తే ఎలా ఉంటుందో.. వివరిస్తున్నారు. చంద్రబాబు గత ప్రసంగాలకు.. ఇప్పటికీ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. సూటిగా ఆసక్తికరంగా.. ఎక్కడికి వెళ్తే అక్కడ… వాడుక భాషను ఉపయోగిస్తూ ప్రచారం చేస్తూ… హాట్ టాపిక్ అవుతున్నారు.