టీడీపీపై సామాజిక అలజడి రేపేందుకు ప్రణాళికాబద్దంగా ఆరోపణలు చేసుకుంటూ వెళ్తున్న ప్రతిపక్షం వైసీపీకి…ఎమ్మెల్సీ పదవుల పంపకంతో.. నేరుగా చెక్ పెట్టేశారు. గవర్నర్ కోటా, ఎమ్మెల్యేల నుంచి ఎన్నుకునే ఎమ్మెల్సీల ఎంపికలో తెలుగుదేశం బీసీలకు సింహభాగం కేటాయించింది. ఇందులో కూడా పార్టీని నమ్ముకున్న వారిని, సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించింది. పదవీకాలం పూర్తయిన యనమల రామకృష్ణుడికి మళ్లీ అభ్యర్ధిత్వాన్ని పునరుద్దరించారు. ఉత్తరాంధ్రకు చెందిన రజకుల నేత పురపాలక శాఖలో గుంటూరు లాంటి కార్పొరేషన్లకు కమిషనర్ గా పనిచేసిన దువ్వారపు రామారావు, వాల్మీకి బోయలకు గౌరవం కల్పించేందుకు కర్నూలుకు చెందిన బీటీ నాయుడుకు ప్రాతినిధ్యం కల్పించారు. మరోస్థానాన్ని ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఏపి ఎన్టీవో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అశోక్ బాబుకు కేటాయించారు.
ఇక గవర్నర్ కోటాలో ఇరువురిని ఎంపిక చేశారు. ఇటీవల పదవీ కాలం పూర్తయిన శమంతకమణికి మళ్లీ ప్రాతినిధ్యం కల్పించారు. స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన విశాఖపట్నానికి చెందిన ఎం.వి.ఎస్ మూర్తి మరణించడంతో ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల నియోజకవర్గానికి బుద్దా నాగజగదీశ్వరరావును ఎంపిక చేశారు. యనమల రామకృష్ణుడు, రజక సంఘాల నేత దువ్వారపు రామారావు, కర్నూలుకు చెందిన బీటి నాయుడు, ఉత్తరాంధ్రాకు చెందిన నాగజగదీశ్వరరావులు బీసీ వర్గాలకు చెందిన వారు. అశోక్ బాబు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, శమంతకమణి ఎస్సీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరూ కూడా పార్టీ కోసం పనిచేశారని, అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు ప్రాతినిధ్యం వహించేలా ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు.
ఎమ్మెల్సీ ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎలాంటి వ్యతిరేకతా వ్యక్తం కాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధుల ఎంపికలో సమతూకం పాటించారని, బీసీలకు పెద్ద పీట వేశారని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీపై కులముద్ర వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను… చేతలతోనే చెక్ పెట్టారని… టీడీపీ నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.