తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైకాపా నేత చలమలశెట్టి సునీల్ టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… పౌరుషం ఉండే వ్యక్తులు వైకాపాలో ఉండలేరనీ, అలాంటివాళ్లంతా ప్రజాహితం కోరే టీడీపీలో మాత్రమే ఉండగలరన్నారు. రాష్ట్రంలో ఉండి మనం పోరాటం చేస్తుంటే, హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో జగన్ ఉన్నారని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ గురించి జగన్ ఒక్కమాట మాట్లాడటాన్ని ఎవరైనా విన్నారా అన్నారు. కానీ, ఈయనేదో పోరాటం చేశారనీ, వాళ్లేదో (కేంద్రం) జోన్ ఇచ్చారని ఆనందపడుతున్నారని ఎద్దేవా చేశారు.
రైల్వేజోన్ ఇవ్వకపోతే మాట్లాడరనీ, ప్రత్యేక హోదా మీద నోరు తెరవరనీ, విభజన చట్టంలో హామీల కోసం స్పందించే పరిస్థితే లేదనీ, కడపలో స్టీల్ ప్లాంట్ పై కూడా నోరు తెరవలేని నిస్సహాయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని సీఎం విమర్శించారు. ఐదేళ్ల తరువాత ఆయన రాష్ట్రానికి వచ్చారనీ, ఇక్కడో ప్యాలేస్ కట్టుకుని ప్రారంభోత్సవం చేసుకుని మళ్లీ వెళ్లిపోయారన్నారు. వీళ్ల రాజకీయం హైదరాబాద్ లో, మన రాజకీయం అమరావతిలో అన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ లో ఉండొచ్చని చెప్పినా, కానీ ఈ గడ్డ మీద ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో ఇల్లు లేకపోయినా బస్సులో ఉంటూ పాలన సాగించామన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో హామీలు ఇమ్మని అడిగితే ప్రధానికి ఎందుకంత కోపమన్నారు. ఆయన్ని ఏదైనా అడిగితే కేంద్ర సంస్థల్ని ప్రయోగించి దాడులు చేస్తున్నారన్నారు. ఇంకోపక్క, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఐదేళ్లూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టామనీ, కేంద్ర సాయం ఉండి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదనీ, అయినాసరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రాలో శాశ్వత భవనం ఉన్న పార్టీ తమది మాత్రమే అని వైకాపా నేతలు నిన్నట్నుంచీ చెబుతున్నారు కదా! కానీ, గడచిన ఐదేళ్లలో జగన్ నివాసం హైదరాబాద్ కే పరిమితమైందనీ, సొంత రాష్ట్రానికి ఎందుకు రాలేకపోయారనే అంశాన్ని ప్రధాన విమర్శనాస్త్రంగా టీడీపీ మార్చుకుంటున్నట్టుగా ఉంది. అన్ని సదుపాయాలూ ఉంటే తప్ప జగన్ ఉండనీ, ఏ సదుపాయాల్లేకపోయినా పాలన ఇక్కడి నుంచే చేశామనే అంశాన్ని ప్రజలకు సీఎం వివరించారు. గృహప్రవేశం చేసిన వెంటనే జగన్ హైదరాబాద్ కి వెళ్లిపోవడం విమర్శలకు మరింత ఆస్కారం కల్పించిన అంశమైంది.