చంద్రబాబు ఇలా తిండినీరు లేకుండా కష్టపడుతూ ప్రజల కష్టాలు తీర్చేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వైసీపీ నేతలు… ఇతర వ్యతిరేకులు పబ్లిసిటీగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అలా తిరగకపోయినా జరిగేది జరుగుతుందని క్రైసిస్ బృందాలు.. ఎన్డీఆర్ఎఫ్ తాము చేయాల్సిన పనులు చేస్తాయని అంటున్నారు. నిజంగానే ఇలా పని చేసే వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయా ?. ఈ విషయంపై ఒక్క సారి ఆలోచిస్తే… రోడ్డు మీద అడ్డం పడిన రాయిన తొలగించడానికి కూడా రెండు రోజుల సమయం తీసుకుంటారు అధికారులు. ఎన్డీఆర్ఎఫ్ అయినా.. మరో వ్యవస్థ అయినా.. దారిలో పెట్టి నడిపించడానికి ఓ అడ్మినిస్ట్రేటర్ ఉండి తీరాలి.
వరదలు వచ్చి డ్యాములు కొట్టుకుపోయిన తర్వాత నష్టపరిహారం చెల్లించడం పాలన కాదు. ముందుగానే రంగంలోకి దిగి.. వీలైనంత ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించడం.. కష్టాల బారిన పడిన వారికి సాంత్వన కలిగించి ప్రాథమిక అవసరాలు తీర్చడం అత్యంత ముఖ్యం. చంద్రబాబు ఫీల్డ్ లో లేకపోతే.. ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అదే జగన్ రెడ్డి సీఎంగా ఉండి ఉంటే.. ఆయన ప్రజల్ని గాలికొదిలేసి… తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేవారు కాదు. సమీక్ష చేసినట్లుగా ప్రెస్ నోట్లు మాత్రం రిలీజయ్యేది. కానీ ప్రజలు మాత్రం తమ కష్టాలు తాము పడేవారు.
ప్రభుత్వానికైనా.. సంస్థకైనా.. నడిపించే నాయకుడే కీలకం. అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేసేలా నాయకుడు చేయాలి. ఆ నాయకుడు పనికి మాలిన వాడయితే ఏం జరుగుతుందో.. పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల పాటు ప్రజలు చూసేశారు. ఇప్పుడు కొత్తగా పని చేసేవాడ్ని విమర్శించాల్సిన పని లేదు. చంద్రబాబుకు ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరి పబ్లిసిటీ అక్కర్లేదు. ఆయన తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడనంత బలమైన విజయం చూశారు. ఆయన ఎప్పుడో ఉన్నత శిఖరాలను అధిరోహించారు.