మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నడుస్తున్న తెలుగు సినీ పరిశ్రమ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదం పై స్పందించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగు సినీ పరిశ్రమకు గత కొంతకాలంగా చిన్నస్థాయి యుద్ధమే నడుస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు సన్మానం చేయాలని సంకల్పిస్తే ఫిలించాంబర్ ఒప్పుకోలేదని నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించాయి. అదే సమయంలో వైసిపి అధికార ప్రతినిధి రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే రెడ్లను తమ సినిమాల్లో విలన్ లు గా చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు దేశంలో ఎక్కడా లేని విధంగా సినిమా టికెట్ల రేట్లను తగ్గించి తీరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఏది ఏమైనా జగన్ తెలుగు సినీ పరిశ్రమ తొక్కడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నెలకొంది. నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే నిత్యవసర వస్తువులు , సిమెంట్ వంటి వాటి రేట్లను తగ్గించే వారు కానీ కేవలం సినిమా టికెట్ల ధరలు తగ్గించడం పరిశ్రమపై పగ తీర్చుకోవడమే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు కూడా ఈ వివాదంపై స్పందించారు.
చంద్రబాబు నాయుడు ఈరోజు వ్యాఖ్యానిస్తూ, సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబు కు అనుకూలం అనే వాదనను తప్పుపట్టారు. సినీ పరిశ్రమ తనకు సహకరించింది లేదని ఆయన చెప్పుకొచ్చారు. తనకు వ్యతిరేకం గా సినిమాలు తీశారని, అది కూడా తాను అధికారంలో ఉన్నప్పుడే ఆ విధంగా తీశారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అయితే తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు తనకు వ్యతిరేకంగా సినిమాలు చేసినప్పటికీ తాను వాటిని పెద్దగా పట్టించుకోలేదని వాదనను కూడా చంద్రబాబు అన్యాపదేశంగా వినిపించారు. మరోవైపు సినీ పరిశ్రమ ప్రముఖుల తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎవరితో ఇబ్బందులు లేవని చెప్పు కొచ్చే ప్రయత్నం చేశారు.
2009లో చిరంజీవి పార్టీ పెట్టకపోతే ఉంటే అప్పుడే తాము అధికారంలోకి వచ్చే వారం అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే చిరంజీవి పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని, ప్రస్తుతం కూడా చిరంజీవి తనతో బాగానే ఉన్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ల వివాదంలోకి టిడిపిని అనవసరంగా లాగుతూ ఉన్నారని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా, జగన్ సినీ పరిశ్రమ పట్ల కక్షపూరిత వైఖరి అవలంబిస్తూ ఉన్నాడనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.