ఫాక్స్ కాన్ చైర్మన్ హున్ హయి నేతృత్వంలోని బృందం … ఏపీ సీఎం చంద్రబాబునాయుడును సోమవారం శ్రీసిటీలో కలవనుంది. శ్రీసిటీలో సోమవారం పలు యూనిట్ల ప్రారంభోత్సవం.. శంకుస్థాపన.. ఎంవోయూలు చేసుకునే కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఫాక్స్ కాన్ బృందం వస్తోంది. చంద్రబాబుతో అక్కడే ప్రాధమిక అంశాలపై చర్చలు జరపనుంది.
ఇటీవల ప్రధానితో మోడీతో ఫాక్స్ కాన్ చైర్మన్ హున్ హయి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లో తమ పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చించినట్లుగా ప్రకటించారు. దేశంలో తొలిగా ఫాక్స్ కాన్ పెట్టుబడులు పెట్టింది ఏపీలోనే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఈ పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నందున నేరుగా ఆయనతో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.
ఐఫోన్ తయారీ ప్లాంట్ను ఇప్పటికే కర్ణాటకలో పెట్టారు. తెలంగాణలోనూ మొబైల్ ఉప ఉత్పత్తుల ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఏపీలో ఈవీల రంగంలోకి వచ్చేలా కొత్తగా ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఫాక్స్ కాన్ చైర్మన్ తో భేటీకి ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్లి తమ ఫ్యూచర్ సిటీఆలోచన వివరించి .. పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ క్రమంలో ఫాక్స్ కాన్ తమ కొత్త వెంచర్ల పెట్టుబడులను ఎక్కడ పెడుతుందన్నది ఆసక్తికరంగా మారింది