ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓ 50 రోజులపాటు సొంత నియోజక వర్గాల్లో ఉండాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రచారం చేయాలి. సమస్యలుంటే వెంటనే పరిష్కారానికి కృషి చేయాలి. నియోజక వర్గంలోని అన్ని గ్రామాలను ఎమ్మెల్యేలు కవర్ చేయాలి. ప్రతీ ఇంటికీ తప్పకుండా వెళ్లాలి! పార్టీపరంగా ఇది టీడీపీకి మేలు చేసే కార్యక్రమమే. అయితే, గడచిన మూడేళ్లుగా అధికారం అనుభవిస్తూ.. ప్రజల్లోకి పెద్దగా వెళ్లకుండా కాలయాపన చేసిన ఎమ్మెల్యేలకు ఈ ఇంటింటి కార్యక్రమం కొత్త సమస్యగా మారింది. గత ఎన్నికల్లో తొలిసారిగా టిక్కెట్ దక్కించుకుని, ఎమ్మెల్యేలుగా ఎన్నికైపోయిన కొద్దిమందికి ఇది రెండు రకాలుగా టెన్షన్ పెడుతోందని టీడీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతూ ఉండటం విశేషం.
మొదటి రకం టెన్షన్ ఏంటంటే… ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ ఉండటం! ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్తున్నారా లేదా, కొన్ని ఇళ్లతోనే మమ అనిపించుకుంటున్నారా అనే అంశంపై గట్టి నిఘా పెట్టినట్టు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే ఒక రోజులో ఎన్ని ఇళ్లను కవర్ చేస్తున్నారు, ప్రజలతో ఎలా మాట్లాడుతున్నారు, ప్రభుత్వ పథకాల గురించి సరిగా వివరిస్తున్నారా లేదా, ఆ ఎమ్మెల్యేపై ప్రజలు కోపంగా ఉన్నారా లేదా అనే పనితీరుపై కూడా అనునిత్యం నివేదికలు అందుతున్నాయట! అంటే, ఈ కార్యక్రమం జరుగుతున్న 50 రోజులూ ఎమ్మెల్యేల ప్రతీ కదిలకపై బిగ్ బాస్ కన్నేసి ఉంచినట్టే. పైగా, ఈ కార్యక్రమం ఆధారంగానే మార్కులేస్తామనీ, ర్యాంకింగులు ఇస్తామనీ, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులకు కూడా ఇదే ప్రాతిపదిక అని కూడా అంటున్నారు. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు పరిస్థితి అంతా గందరగోళంగా కనిపిస్తోందట.
ఇక, రెండోరకం టెన్షన్ ఏంటంటే.. 2014 తరువాత ప్రజల్లోకి వెళ్లనివారికి ఇప్పుడు ఇంటింటికీ వెళ్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన వేరుగా ఉందట! ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి చాలామంది ఎమ్మెల్యేలకు ఎదురౌతోందని చెబుతున్నారు. మూడేళ్లుగా మా సమస్యలు గుర్తుకు రాలేదా అంటూ ప్రజలు నిలదీస్తుండటంతో కొందరు ఎమ్మెల్యేలు మౌనంగా నిలబడిపోతున్నారట. ఈ పరిస్థితి కూడా చంద్రబాబుకు నివేదిక వెళ్లిపోతుందనీ, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ఉంటుందో లేదో అనే ఆందోళన వారిలో పెరుగుతోందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. నిత్యం ప్రజల్లో ఉంటూ వస్తున్నవారికి ఫర్వాలేదుగానీ, ఇలా చుట్టం చూపుగా ప్రజలకు కనిపించే ఎమ్మెల్యేలకు మాత్రం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చెమటలు పట్టిస్తోందనే చెప్పాలి. జనంలోకి వెళ్తే ఒక సమస్య.. వెళ్లకపోతే ఇంకో సమస్య అన్నట్టుగా తయారైంది.