కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావురా అని నిలదీస్తే… దూడ గడ్డి కోసం అన్నట్టుంది! శాసన సభలో మెజారిటీ ఉన్నా కూడా వైకాపా నుంచి ఫిరాయింపుల్ని ఎందుకు ప్రోత్సహించారూ అనే ప్రశ్నకు… ఇదిగో ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారని చెప్పుకోవాలి! నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశం సందర్భంగా ఈ టాపిక్ మాట్లాడారు. అక్కడి ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు నాయకులూ కార్యకర్తలూ అనుసరించాల్సిన వ్యూహాల గురించి చెప్పారు. ఆ తరువాత, ఫిరాయింపుల గురించి మాట్లాడారు. ఇతర పార్టీల నుంచి నాయకుల్ని టీడీపీలోకి తీసుకురావాల్సిన అవసరాన్ని వివరించారు.
తనకు తరువాతి తరం నాయకులు కావాలనీ, ఆ నాయకులు ఎన్నికల్లో గెలవాలనీ, అలాంటి వారే అవసరమని చంద్రబాబు చెప్పారు. ఇతర పార్టీల నుంచీ కొంతమంది నాయకుల్ని తీసుకొచ్చామనీ, ఈ సందర్భంలో కొంతమందికి నష్టం జరిగిందన్న విషయం వాస్తవమే అన్నారు. అయితే, ఆ కొంతమంది కోసం ఆలోచిస్తూ కూర్చుంటూ ఎక్కిన చెట్టునే నరికేసుకోగలమా అంటూ పార్టీ కార్యకర్తలకు చంద్రబాబు చెప్పడం విశేషం! తాను పదేళ్ల కిందటే అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఇలా ఉండేది కాదనీ, ఆ పదేళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. తన వల్ల చాలామంది లాభం పొందుతున్నారనీ, వారంతా తిరిగి తమకే ఓటెయ్యాలని సీఎం కోరారు. ‘నేను ఇస్తున్న ఫించెన్లు తీసుకుంటున్నారు, వేయించిన రహదారుల్ని వాడుకుంటున్నారు, రేషన్ పొందుతున్నారు. అలాంటప్పుడు నాకు ఓటెయ్యకపోతే ఎలా’ అని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
ఈ వ్యాఖ్యలు ఒకింత వివాదాస్పదంగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే, టీడీపీ సర్కారు ఇస్తున్న రేషన్లు, పథకాలు, వేయించిన రోడ్లు, ఇస్తున్న పెన్షన్లూ.. ఇవన్నీ చంద్రబాబు జేబులోంచి సొమ్ము తీసి ఇస్తున్నవి కాదు కదా! ప్రజల సొమ్మే కదా. అయినా, ప్రజల సొమ్ముకు అధికార పార్టీ ఒక కాపలాదారు మాత్రమే. అంతేగానీ, హక్కుదారుగా మాట్లాడితే ఎట్లా..? ప్రభుత్వాన్ని నడపడం వారి బాధ్యత.. అది వారి ధాతృత్వమో, వితరణో, పెద్ద మనసో, గొప్పతనమో కాదు కదా. పోనీ, చంద్రబాబు చెబుతున్న సో కాల్డ్ ప్రజా ప్రయోజనాల కోసం టీడీపీ సొంత ఫండ్ నుంచి నిధులు విడుదల చేస్తున్నారా..? కట్టుకున్న భార్యకు చీర కొనడం కూడా ఊరికి ఉపకారం అన్నట్టుగా చెప్పుకున్నట్టుంది.
ఇక, ఫిరాయింపుల విషయానికొస్తే… రాజకీయాల ప్రక్షాళన కోసమే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు! ప్రక్షాళన అంటే ఇదేనా..? ఒక పార్టీ టిక్కెట్ పై గెలిచినవారితో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవులు ఇవ్వడం ఏ తరహా ప్రక్షాళన అవుతుంది..? ప్రజల తీర్పునే వెక్కిరిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఫిరాయింపులు ప్రోత్సహించడం ఏదో సంఘ సంస్కరణ అన్నట్టుగా చెప్పుకుంటే ఎలా..? గెలవడానికి నాయకుడు కావాలీ, అందుకే కొంత రాజీపడి, కొంతమందిని నష్టం చేకూర్చినా కూడా తట్టుకుని ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకున్నాం అని చెప్పారు. అంటే, టీడీపీలో గెలిచే నాయకుల లేరని భావిస్తున్నట్టా..? కొత్త నాయకులు కావాలంటే, పక్క పార్టీల్లో ఉన్నవారిని గుంజుకోవడమే కొత్తదనమా..? ఫిరాయింపులు, ప్రభుత్వ పథకాల విషయంలో చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు ఇలాంటి విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయనడంలో సందేహం లేదు.