గత ఐదేళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వైసీపీ వ్యవహరించిందని జగన్ రెడ్డి పాలనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎండగట్టారు. ప్రజాస్వామ్య పునాదులపై దాడి చేసి, వికృత చేష్టలకు పాల్పడ్డారన్నారు. అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పాలన చూడలేదని ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో శాంతి భద్రతల వైఫల్యంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు.
ప్రభుత్వ పెద్దల కక్ష సాధింపు చర్యల్లో పోలీసులను కూడా భాగస్వామ్యం చేశారని..వారితో కుమ్మకై నిబంధనలకు విరుద్దంగా కొంతమంది పోలీసులు వ్యవహరించారని అన్నారు. నిబంధనలకు విరుద్దంగా పని చేయలేమని వాదించిన అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వేధించారని.. పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని తెలిపారు.
Also Read : అన్ని లెక్కలు తేల్చేస్తున్న చంద్రబాబు!
తనపై బాబ్లీ కేసు తప్ప గతంలో మరో కేసు లేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక 17కేసులు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ పై కూడా 7 కేసులు నమోదు చేశారన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఏకంగా అరవైకి పైగా కేసులు పెట్టి.. ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమ కేసులతో వేధించారని చెప్పారు. రఘురామకృష్ణంరాజును లాకప్ లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారని.. అందుకు సంబంధించిన వీడియోలను చూసి పైశాచిక ఆనందం పొందారని అన్నారు.
వైసీపీ హయాంలో కేసులు ఉన్న వారు ఓసారి నిల్చోవాలని చంద్రబాబు కోరగా..దాదాపు 80 శాతం మంది నిల్చున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసిన నాయకులందరిపై కేసులు పెట్టారని..కానీ అక్రమ కేసులు బనాయించిన వారినే ప్రజలు అసెంబ్లీకి దూరం చేశారని చంద్రబాబు అన్నారు.