ఊరించి ఊరించి ఉసురు తీశారు అన్నట్టుగా… విశాఖ రైల్వే జోన్ ఇస్తాం ఇస్తామని, చివరికి దీన్నో ఎన్నికల ప్రచార తంతు నిర్ణయంగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేంద్రం తీసుకున్నది విధానపరమైన నిర్ణయం మాత్రమే. ఇక్కడి నుంచి మరో ఏడాది గడిస్తే తప్ప… జోన్ వాస్తవ రూపంలోకి రాదు. ఇక, కేంద్రం జోన్ ప్రకటించేసరికి… అదో విజయంగా చెప్పుకోవడం ప్రారంభించేసింది ప్రతిపక్ష పార్టీ వైకాపా. విశాఖ రైల్వే జోన్ కోసం నాలుగేళ్లుగా జగన్ అలుపెరుగని పోరాటం చేశారనీ, వైకాపా నేతలు రైల్వే జోన్ కోసం దీక్షలు చేశారనీ, పాదయాత్రలు చేశారనీ… ఆ కృషి ఫలితమే కేంద్రం ప్రకటన అని ఆ పార్టీ ప్రచారం మొదలుపెట్టేసింది. అంతేకాదు, రైల్వోజోన్ జగన్ వల్ల సాధ్యమైంది కాబట్టి… ప్రత్యేక హోదా కూడా ఆయన వల్లనే వస్తుందని సోషల్ మీడియాలో కూడా ఓ ప్రచారం జరుగుతోంది.
ఈ తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈరోజు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ… రైల్వేజోన్ ప్రకటనపై వైకాపా సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ పార్టీతో భాజపా కూడా జత కలిసిందన్నారు. భాజపా, వైకాపా ఈ రెండు పార్టీల లాలూచీ రాజకీయాలు ఈ సందర్బంగా మరోసారి బయటపడ్డాయన్నారు. ఆంధ్రాకి ఇచ్చిన హామీలను అన్నీ సక్రమంగా పూర్తి చేస్తే… రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు ప్రధాని మోడీకి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా, భాజపా నాటకాలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఏమాత్రమూ నిలకడలేని నాయకుడనీ, అట్టహాసంగా గృహప్రవేశం చేసి… ఒక్కరోజైనా ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ వెళ్లిపోయారని కూడా ముఖ్యమంత్రి విమర్శించారు.
రైల్వేజోన్ ఇస్తున్నామంటూ కేంద్రం చేసిన ప్రకటనలో డొల్లతనం గురించి వైకాపా మాట్లాడటం లేదు. ప్రస్తుతం కేంద్రం నిర్ణయం వల్ల ఒరిగే లాభాలపై చర్చించడం లేదు. దీంతో యువతకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, ఆదాయం పెరిగిపోతుందంటూనే సాక్షి మీడియా కూడా కథనాలు ప్రసారం చేస్తోంది. కేంద్రం తీరులో డొల్లతనాన్ని ప్రశ్నించడం లేదు. సరే… రైల్వేజోన్ సాధన కోసం వైకాపా సాగించిన పోరాటాన్ని కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు! ఇదే తరహా హోదా కూడా జగన్ సాధించేస్తారని అంటున్నారు. ఇంతకీ, అది ఏ తరహా అనేది చెప్తేనే కదా ప్రజలకూ స్పష్టమౌతుంది కదా.