రెవెన్యూ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జగన్ ప్రభుత్వ అక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాల వారీగా ఎక్కడెక్కడ భూములు కబ్జాకు గురయ్యాయో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ కమిషనర్లు జిల్లాలో పర్యటించి సమాచారం సేకరించాలన్నారు. 22A నుంచి ఫ్రీ హోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లను మరోసారి పరిశీలించాలన్న చంద్రబాబు..నిజమైన లబ్దిదారుల సంఖ్య తేల్చాలన్నారు.
సమీక్ష సమావేశం ముగిసిన అనంతరం మంత్రి అనగాని సత్య ప్రసాద్ సీఎం సమీక్ష సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించారు. మదనపల్లి దస్త్రాల దహనం తర్వాత అధికారులు రాజకీయ నాయకుల చేతిలో ఎలా కీలుబొమ్మలుగా మారిపోయారో ఈ ఘటన రుజువు చేస్తుందన్నారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులను సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఇక, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పైనా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు చెప్పారు.
ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉండేది.. దీనిని చూసి గుజరాత్ లో యాక్ట్ తీసుకొచ్చారు.ఇప్పుడు దాని అధ్యయనం చేసి ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు మంత్రి. జగన్ పేరుతో ఉన్న సర్వే రాళ్ళను ఎలా ఉపయోగించాలో చూస్తామన్నారు. 78 లక్షల రాళ్ళపై జగన్ పేర్లు తీయాలంటే 15కోట్లు ఖర్చు అవుతుందన్నారు.
పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్న మంత్రి సత్యప్రసాద్..ఇకపై క్యూ ఆర్ కోడ్ తోపాటు ల్యాండ్ కు దారి చూపేలా పాస్ పుస్తకం ఇస్తామన్నారు. ఆయా జిల్లాలలో జరిగిన భూకబ్జాలను పరిశీలించి సర్కార్ చర్యలు చేపడుతుందని అన్నారు.