యాభై శాతం వీవీప్యాట్లను ఓట్ల లెక్కింపులో లెక్కించాలని కోరుతూ సుప్రీం కోర్టును 21 పార్టీలు ఆశ్రయిస్తూ రివ్యూ పిటీషన్ కూడా వేశాయి. ఆ పిటీషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 21 పార్టీలకూ ఓరకంగా సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈరోజు కోర్టులో వాదనలు వినిపిద్దామని ప్రిపేర్డ్ గా వచ్చిన విపక్షాలన్నీ తీవ్ర నిరాశకు గురయ్యాయి. అయితే, 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలనే డిమాండ్ ను కొనసాగిస్తామనీ, ఇక్కడితో ఈ పోరాటం ఆగదని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
తాము దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ ను కోర్టు తోసిపుచ్చిందనీ, సుప్రీం తీర్పును తాము గౌరవిస్తున్నామని చంద్రబాబు నాయుడు అన్నారు. కేవలం వీవీప్యాట్ల స్లిప్పుల కోసమే ఏకంగా రూ. 9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనీ, అలాంటప్పుడు వాటిలోని 50 శాతం స్లిప్పులు లెక్కించకపోతే ఏం ఉపయోగమని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలనేదే తమ కోరిక అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల ప్రక్రియలో మరింత పాదర్శకత రావాల్సి ఉందనీ, అంతవరకూ తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అంతమాత్రాన, కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నట్టు కాదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలని గౌరవిస్తూనే, వీవీ ప్యాట్ల అంశమై మరోసారి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని చంద్రబాబు చెప్పారు. వీవీప్యాట్ల అంశంపై ఇప్పటికే ప్రజలకు కొంత అవగాహన కల్పించడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించేందుకు ఎన్నికల సంఘం ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. లెక్కించేందుకు సిబ్బంది సరిపోరు, ఎక్కువ సమయం పడుతుందని అనే కారణాలు సరైనవిగా కనిపించడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ 21 పార్టీలు మరోసారి ఎన్నికల సంఘాన్ని కలిసి, వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలంటూ మరో వినతి పత్రం ఇస్తారు. రివ్యూ పిటీషన్ ను కోర్టు కొట్టేసింది, 5 శాతానికి మించి లెక్కించేందుకు తాము సిద్ధంగా లేమని మొదట్నుంచీ ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఈసీకి ఫిర్యాదు ఇచ్చినా పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదనేది ముందుగానే అర్థమౌతూనే ఉంది. పోరాటం కొనసాగిస్తామని అంటున్నారుగానీ… ఆ పోరాట మార్గాలు ఇంకేమున్నాయనేది మరింత స్పష్టత రావాల్సి ఉంది.