ఆంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని మోడీ సర్కారు చేసిన అన్యాయంపై ఇప్పటికే టీడీపీ సర్కారు ధర్మపోరాట దీక్షల్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభలు ప్రారంభించినప్పుడే ఓ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు తెచ్చారు. జిల్లాలవారీగా ధర్మపోరాట సభలు పూర్తయ్యాక, చివరి సభను భారీ ఎత్తున అమరావతిలో నిర్వహించాలనీ, ఆ కార్యక్రమానికి జాతీయ నేతల్ని ఆహ్వానించాలని అనుకున్నారు. దానికి సంబంధించిన చర్చ కోల్ కతాలో కొంతమంది నేతల మధ్య జరిగినట్టు సమాచారం.
కోల్ కతా సభ ముగిసిన తరువాత మమతా బెనర్జీ, శరద్ పవార్ లతోపాటు కొంతమంది నేతలతో సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. భాజపాయేతర పార్టీల కూటమి తొలిసభ విజయం కావడంతో, దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన సభలపై కూడా చర్చ జరిగినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నారు. ఢిల్లీ, అమరావతి, బెంగళూర్ సభలకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రెండో సభను అమరావతిలో నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఫిబ్రవరి 15 తరువాత ఈ సభ జరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించిన రెండు ధర్మపోరాట దీక్షల్నీ ఒక వేదిక మీద ఒకేసారి జరపాలన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. ఆ వేదికే… ప్రాంతీయ పార్టీల కూటమి రెండో సభకీ వేదిక కాబోతోందని సమాచారం.
అమరావతి సభకు ప్రముఖ జాతీయ నేతల్ని ఆహ్వానించడంతోపాటు, కోల్ కతా సభకు హాజరుకాని రాజకీయ పార్టీలతో కూడా ఈలోగా చర్చించి, అమరావతికి వచ్చేలా చేయబోతున్నారు. దాదాపు పదిహేను లక్ష మంది ప్రజలతో ఈ సభలో తన సత్తా చాటుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రాలో లోక్ సభతోపాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి, పెద్ద సంఖ్యలో జాతీయ నేతలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ సభ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా భారీ ప్రారంభంగా ఉపయోగపడుతుంది అనేదీ సీఎం ఆలోచనగా ఉందనీ సమాచారం.