అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ తమదే అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉంటారు! కానీ, ఇప్పుడు పార్టీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కీలక నేతలే తలోరకంగా వ్యవహరిస్తూ పార్టీకి తలవంపులు తీసుకొస్తున్నారనడంలో సందేహం లేదు. తాజాగా జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నేతల క్రమశిక్షణపైనే చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖ భూవివాదం నేపథ్యంలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుడు మధ్య చంద్రబాబు క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే తరుణంలో అసంతృప్త స్వరాలను వినిపిస్తున్న ఇతర నేతల్ని కూడా దారిలోకి తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధమౌతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో నాయకులకు శిక్షణ శిబిరాలను నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఆ శిబిరంలో ‘క్రమశిక్షణ’ అనే అంశానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు! అయితే, కట్టుతప్పిన తమ్ముళ్లకు శిక్షణా తరగతులు సరిపోతాయా అనేదే అసలు ప్రశ్న..?
తాజాగా గంటా, అయ్యన్నల ఆధిపత్య పోరు, ఫిరాయింపుల పుణ్యమా అంటూ జిల్లాలో కొంతమంది నేతల సిగపట్లు, మంత్రి వర్గ విస్తరణ తరువాత అసంతృప్తికి గురైన సీనియర్ నేతలు, మీడియా సమావేశాల్లో సంచలన వ్యాఖ్యలు చేసే నేతలు.. ఇలా ముందెన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు కట్టు తప్పుతున్నారన్నది వాస్తవం. గంటా, అయ్యన్నల వ్యవహారం పార్టీకి చెడ్డపేరు తీసుకొస్తుంటే.. మరోపక్క భూకుంభకోణాల్లో దొరికిపోయిన దీపక్ రెడ్డి వ్యవహారం ఇంకో సమస్యగా మారింది. తాజా సమావేశంలో దీపక్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేసినా.. పార్టీపై మరక పడ్డట్టే కదా. విశాఖ నేతల వ్యవహారం, దీపక్ రెడ్డిపై చర్యలతోపాటు ఇంకా తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి.
కడప జిల్లాలో పరిస్థితి ఇంకా చక్కబడలేదు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య వర్గపోరు అలానే ఉంది. ఇద్దరి మధ్యా చంద్రబాబు రాజీ కుదిర్చినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కుదురుకోలేదన్నది వాస్తవం. తనకు ఇచ్చిన ఎమ్మెల్సీ హామీని ముఖ్యమంత్రి ఇంకా నెరవేర్చలేదంటూ రామసుబ్బారెడ్డి ప్రస్తుతం గుర్రుగానే ఉన్నారట. ఇక, సీఎం సొంత జిల్లా చిత్తూరులో కూడా టీడీపీ పరిస్థితి ఏమంత పటిష్టంగా కనిపించడం లేదు. మంత్రి వర్గ విస్తరణలో బొజ్జలకు వేటు వేయడం, వైకాపా ఫిరాయింపు నేత అమర్ నాథ్ రెడ్డికి ఆమాత్య పదవి ఇవ్వడంతో అక్కడా వర్గపోరు పెరిగింది. ఆ జిల్లాలో ఎంపీ శివప్రసాద్ సంగతి సరేసరి! అధినేత చంద్రబాబుపైనే నేరుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
కొంతమంది ప్రముఖ నేతల్ని అదుపులో పెట్టడం చంద్రబాబుకు కూడా సాధ్యం కావడం లేదన్న విమర్శలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. అలాంటి నేతల్లో బోండా ఉమా మహేశ్వరరావు, కేశినేని నాని వంటివారు ఉన్నారు! ప్రభుత్వ అధికారులతో ఈ మధ్య కేశినేని చేసిన వీరంగం అందరూ చూశారు. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా చంద్రబాబు తీరుపై ఉన్న అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరిచిన నేతల జాబితా చాలానే ఉంది. మరి, వీరి చర్యలన్నీ క్రమశిక్షణా రాహిత్యం కిందకే వస్తాయి కదా! త్వరలో ఏర్పాటు చేయబోతున్న శిక్షణ తరగతుల వల్ల ఈ నేతలందరూ దార్లోకి వచ్చేస్తారా..? డిసిప్లిన్ అంటూ నాలుగు పాఠాలు చెప్పించినంత మాత్రాన పరిస్థితి మారిపోతుందా..? మొత్తానికి, వీరందరినీ గాడిలో పెట్టడం చంద్రబాబు ముందున్న పెద్ద సవాల్ అనడంలో సందేహం లేదు.