హైదరాబాద్: పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మాణంలో ఉన్న పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సందర్శించారు. ఏరియల్ సర్వే చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. నెలాఖరుకు పోలవరం కుడికాలువ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఆగస్టు 15నాటికి తోటపల్లి రిజర్వాయర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. గుండ్లకమ్మ ప్రాజెక్టునుకూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. 2018నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రకటించారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కోఠిలోని ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. భవనం శిధిలావస్థకు చేరుకుందని, ఇంకా అక్కడ కార్యకలాపాలు సాగించటం ప్రమాదమని అన్నారు. వారంరోజులలోపు గచ్చిబౌలిలోని ప్రభుత్వ భవనాలలోకి తరలించారని ఆదేశించారు. ఉస్మానియా ఆసుపత్రి భవనం హెరిటేజ్ కట్టడమైనప్పటికీ కూలిపోయే దశలో ఉండగా దానిని కొనసాగించటం తెలివితక్కువ పని అన్నారు. హెరిటేజ్ కట్టడాల జాబితాలోనుంచి ఉస్మానియా ఆసుపత్రిని తొలగించటానికి కేంద్రాన్ని సంప్రదిస్తామని చెప్పారు. ఇదే స్థానంలో సంవత్సరమున్నరలోగా కొత్త భవనం నిర్మిస్తామని అన్నారు.